Breaking Newshome page sliderHome Page SliderNational

జీఎస్టీతో రూ. 18 వేల కోట్ల నష్టం – మోదీకి సిద్ధరామయ్య లేఖ

జీఎస్టీ సవరణల వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతగిలిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆదాయంలో తీవ్రంగా తగ్గుదల కనిపించిందని, రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందన్న ఆరోపంచారు. రాష్ట్రానికి సుమారు రూ.18 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని , నష్టపోయిన పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
జీఎస్టీ రేటు నవంబర్ 2024తో పోలిస్తే నవంబర్ 2025లో జీఎస్టీ వసూళ్లు 2 శాతం తగ్గాయి. సరళీకరణపై ఎన్నో రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈనేపధ్యంలో రాష్ట్రం 9.3 శాతం వృద్ధి సాధించినా, జీఎస్టీ వసూళ్లలో మాత్రం ప్రతికూల ధోరణి కనిపించిందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.5 వేల కోట్లు, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.9 వేల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పరిహారం కలుపుకుంటే నష్టం రూ.9,500 కోట్లు చేరవచ్చని, మొత్తం నష్టం దాదాపు రూ.18,500 కోట్లు అయ్యే అవకాశం ఉందని సీఎం అంచనా వేశారు.
ముఖ్యమంత్రి రాసిన లేఖలో 56 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పన్నురేట్లు తగ్గింపుల వల్ల కలిగే ఆర్థిక ప్రభావం, రాష్ట్రంపై పెరుగుతున్న భారాన్ని సంఖ్యలలో వివరించారు. కాబట్టి తమకు తగిన ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
అక్టోబర్‌లో దసరా, దీపావళి సీజన్ ఉన్నప్పటికీ జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కాక తగ్గుదల నమోదు కావడం ఆర్థిక మందగమనానికి సూచికగా వివరించారు. ఇదే ధోరణి దేశవ్యాప్తంగా కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.2 లక్షల కోట్లు ఆదాయలోటు ఏర్పడే అవకాశముందని సీఎం లేఖలో స్పష్టం చేశారు. ఆదాయ లోటును భర్తీ చేసేందుకు పాన్ మసాలాలపై సెస్ విధించడం కేంద్రం పరిశీలిస్తున్న నేపథ్యంలో, ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నిర్ణయం అని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. పాన్ మసాలా జీఎస్టీ పరిధిలో ఉన్నందున, ఈ సెస్ ఆదాయాన్ని 50:50 నిష్పత్తిలో పంచాలని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో మద్దతు ఇస్తున్నాయని, అందుకే రాష్ట్రాల ఆర్థిక లోటును పూడ్చేందుకు 2024–25న బేస్ ఇయర్‌గా తీసుకొని తగిన పరిహారం అందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.