NationalNews

మహా సంక్షోభం.. థాక్రే సర్కారుకు గండం

Share with

మహారాష్ట్ర సర్కారు పతనం అంచున నిలిచింది. మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు ఎక్నాథ్ షిండే తిరిగుబావుటా ఎగురవేసినట్టుగా కన్పిస్తోంది. సూరత్ లోని మెరిడియన్ హోటల్‌లో ఆయనతోపాటు… 13 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. మహారాష్ట్ర సంకీర్ణ సర్కారుకు గండం పొంచి ఉన్నట్టు కన్పిస్తోంది. బీజేపీ కుట్ర కోణం స్పష్టమవుతుందంటూ దుయ్యబట్టారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తరహాలో ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. శివసేన విధేయుల పార్టీ అని… ఎవరికి భయపడబోదన్నారు సంజయ్ రౌత్. ప్రభుత్వంపై అసహనంగా ఉన్న ఎక్‌నాథ్ షిండే… శివసేన నేతలు ఎవరికి టచ్‌లోకి రానట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు… పల్గార్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగ, అలీగఢ్ ఎమ్మెల్యే మహేంద్ర దాల్వి, బివాండీ రూరల్ ఎమ్మెల్యే శాంతారాంతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు… ఉన్నట్టు తెలుస్తోంది.

ఎక్‌నాథ్ షిండే 13 మంది ఎమ్మెల్యేలతోపాటు… ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సూరత్‌లో ఉన్నారంటున్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో మహా వికాస్ అగాడి కూటమి 5, బీజేపీ 5 సీట్లు గెలవడంతో అసలు రచ్చ మొదలైంది. పోటీ చేసిన 5 స్థానాల్లో బీజేపీ గెలిస్తే… కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకాంత్ హండోరే బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఎక్ ‌నాథ్ షిండే సూరత్ లో జరుపుకుంటున్నారని… అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదన్నారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. పలువురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర తిరిగి వస్తామని చెబుతున్నా… వారిని పంపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ఐతే ఎమ్మెల్యేలందరూ శివసేనకు వీర విధేయులని మాత్రం చెప్పాల్సి ఉంటుందన్నారు. మొత్తం వ్యవహారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మాట్లాడినట్టుగా రౌత్ చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి శరద్ పవార్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి వెళ్లబోవడం లేదని ఇప్పటికే శివసేన ప్రకటించింది.

థానేకు చెందిన ఎక్ నాథ్ షిండే.. శివసేన పార్టీ బలోపేతం కోసం కొట్లాడారని… ఆయన తనయుడు శ్రీకాంత్ షిండే… కల్యాణ్ లోక్ సభకు ఎంపీగా ఉన్నారు. 2014లో బీజేపీతో విభేదాల సమయంలో ఎక్‌నాథ్‌ను శివసేన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చి గౌరవించింది. మొత్తం పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఐతే ప్రస్తుతం సూరత్ లో ఉన్న ఎమ్మెల్యేలను అహ్మదాబాద్‌కు తరలించి అక్కడ అమిత్ షాతో భేటీ అయ్యేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తోన్నట్టు తెలుస్తోంది. తనను పార్టీ పట్టించుకోవడం లేదని కొంత కాలంగా షిండే ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించడానికి ఏమీ లేదని… ఎవరి ఫోన్లు అందుబాటులోకి రావడం లేదంటూ ఎద్దేవా చేశారు శివసేన మాజీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ధీటుగా స్పందించారు.