Home Page SliderNational

డబ్బుల్లేవ్… రెండ్రోజులు సర్వీసులు ఆపేస్తున్నామన్న ఎయిర్‌లైన్స్..!

“గో ఫస్ట్” ఎయిర్ లైన్స్‌కు నిధుల కొరత
2 రోజుల పాటు విమానాలు నిలిపివేత
లా ట్రిబ్యునల్ ముందు స్వచ్ఛంద దివాలా దరఖాస్తు

వాడియా గ్రూప్ యాజమాన్యంలోని “గో ఫస్ట్” తీవ్ర నిధుల కొరత కారణంగా మే 3, 4 తేదీల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌లైన్ చీఫ్ కౌశిక్ ఖోనా మంగళవారం తెలిపారు. బడ్జెట్ క్యారియర్ ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకొంది. ప్రాట్ & విట్నీ (P&W) ఇంజిన్‌లను సరఫరా చేయకపోవడంతో ఎయిర్‌లైన్ 28 విమానాల్లో సగానికి పైగా విమానాలను నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సర్వీసులు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోవడంతో నిధుల కొరత ఏర్పడిందన్నారు.

“స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దాఖలు చేయడం అత్యంత దురదృష్టకర నిర్ణయం. కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది చేయాల్సి వచ్చింది” అని ఖోనా చెప్పారు. సంస్థలో ఉన్న తాజా వ్యవహారాలపై పౌర విమానయాన శాఖకు, విమానయాన సంస్థ ముందుగానే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి వివరణాత్మక నివేదికను కూడా సమర్పించనుంది. మే 3, 4 తేదీల్లో విమానాలు నిలిపివేయబడతాయని స్పష్టం చేసింది. NCLT దరఖాస్తును అంగీకరించిన తర్వాత, విమానాలు పునఃప్రారంభించబడతాయని ఖోనా చెప్పారు. గో ఫస్ట్‌లో 5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.