Andhra PradeshHome Page Slider

20 ఎంపీ స్థానాలు ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం :అమిత్ షా

ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలన చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి కావొచ్చని సందర్భంగా ఆదివారం విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో మహాజన సంపర్క్ అభ్యాన్ పేరిట భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రత్యేక సభ నిర్వహించారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమిత్ షా కేంద్రం సాధించిన ప్రగతి ప్రజలకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విపులంగా వివరించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 20 ఎంపీ స్థానాలను కట్టబెడితే అభివృద్ధి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసి చూపిస్తామని ప్రజలు తమను ఆశీర్వదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.2024లో జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఈసారి 300 ఎంపి స్థానాలతో విజయం దక్కించుకుంటామని పేర్కొన్నారు.

అంతేకాకుండా పుల్వామా ఘటనతో పాటు వివిధ సందర్భాల్లో కేంద్రం స్పందించిన తీరును విడమర్చి చెప్పారు. పది సంవత్సరాల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో ఒక అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. దేశంలో పుల్వామా ఘటన జరిగిన పది రోజుల్లోనే పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్నామని సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి కుంభకోణాలు తప్పితే మరేం లేదని అంతేకాకుండా విశాఖపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సాయాన్ని వివరిస్తూనే మరోవైపు ఏపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదని పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తానే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని అమిత్ షా మండి పడ్డారు.