NationalNews

ఒకటి కాదు. రెండు కాదు మూడు పోస్టులైనా ఓకే… కాంగ్రె‌స్‌కు గెహ్లాట్ ఝలక్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బరిలోకి దిగబోతున్న అశోక్ గెహ్లాట్ ఇప్పుడు రూట్ మార్చారు. చాన్నాళ్లుగా రాజస్థాన్ రాజకీయాల నుంచి సైడ్ చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నప్పటికీ… ఆయన మాత్రం సీఎం పీఠాన్ని వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. పళ్ల బిగువున నెట్టుకొస్తున్న రాజస్థాన్ పెద్దాయనకు సీఎం పీఠంపై మాత్రం ఆశచావడం లేదు. ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌ను నియమిస్తే… తన అనుచరుల భవితవ్యం ఏమవుతుందోనన్న వర్రీలో గెహ్లాట్ ఉన్నట్టుగా కన్పిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల మద్దతు కూడగట్టేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసేందుకు గెహ్లాట్ వెళ్తున్నారు. కానీ అంతకంటే ముందుగానే… రాహుల్ గాంధీ యాత్రలో గెహ్లాట్ ప్రత్యర్థి పైలెట్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్ పోటీ చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందా అంటూ పైలట్‌ను ప్రశ్నించగా… ఆయన అందుకు సమాధానం ఇవ్వలేదు.

ఐతే తనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని… పదవి ముఖ్యం కాదంటూ కొత్త ట్యూన్ ఆలపించారు అశోక్ గెహ్లాట్. ముఖ్యమంత్రిగా కొనసాగితారా అన్న ప్రశ్నకు సైతం ఆయన కాలమే సమాధానం చెబుతుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బహిరంగ ప్రక్రియ అని, ఎవరైనా పోటీ చేయవచ్చునన్నారు. ఒక వ్యక్తి మంత్రిగా ఉంటూ… కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవచ్చన్నారు. ప్రతర్థి సచిన్ పైలట్ సీఎం పీఠంపై కన్నేశారంటూ జరుగుతున్న ప్రచారంతో గెహ్లాట్ ఢిల్లీకి పరుగు పరుగున వచ్చారు అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారాయన. తాను కాంగ్రెస్ చీఫ్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్నానని… అంత మాత్రాన మీకెవరికీ దూరం కాబోనంటూ తేల్చిచెప్పారు. ఎక్కడికి వెళ్లినా రాజస్థాన్‌కు సేవ చేస్తూనే ఉంటానన్నారు. ఎవరూ చింతించాల్సిన పనిలేదన్నారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకునే ఆలోచన తనకు ఎంత మాత్రం లేదని గెహ్లాట్ ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టం చేశారు.

ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పటికీ కొంత కాలం రాజస్థాన్ సీఎంగా ఉండేందుకు అనుమతివ్వాలని గెహ్లాట్ కాంగ్రెస్ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. ఓకే సమయంలో రెండు పదవులను నిర్వహించగలరా అని అడిగిన ప్రశ్నకు, గెహ్లాట్ విచిత్రమైన సమాధానం చెప్పారు. పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు ఒకటి కాదు… రెండు కాదు, మూడు పదవులైనా స్వీకరించేందుకు వెనక్కి తగ్గబోనన్నారు. ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాల్సిన సమయంలో… రాజస్థాన్ సీఎంగా తనకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించాలని గెహ్లాట్ కోరుకుంటున్నారు. ఐతే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ… సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తాను ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చని గెహ్లాట్ భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ సోనియా ఆమోదం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షపదవికి ఎన్నిక జరిగే అవకాశం కన్పిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని… రాహుల్ గాంధీని చివరిసారిగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని గెహ్లాట్ ఎమ్మెల్యేలకు చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ నిరాకరిస్తూ వస్తున్నారు.