నమ్మకస్తుడనుకుంటే నట్టేట ముంచాడు… కాంగ్రెస్‌కు గెహ్లాట్ గుణపాఠం
కాంగ్రెస్ నేతల్లో పెరుగుతున్న స్వార్థ్యం
అధికారం కోసం దేనికైనా సై అంటున్న నేతలు
పార్టీ మారేందుకైనా సిద్ధమన్నట్టుగా ప్రకటనలు
రాజస్థాన్ ఎపిసోడ్‌తో హస్తవ్యస్థం
కక్కలేకా మింగా లేక సతమతం
తలపట్టుకున్న సోనియా, రాహుల్
దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోతోంది. పాతాళంలో కూరుకుపోయిన పార్టీని ఎంతగా బయటకు తీయాలని చూస్తున్నా… అది ఏ మాత్రం సాధ్యం కాదనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ట్రాక్‌లో పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే… కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర నిర్వహిస్తూ పార్టీకి జవజీవాలు నింపాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఓవైపు పార్టీని బాగు చేయాలని రాహుల్ గాంధీ కోటరీ భావిస్తుంటే… అనుకోని అవాంతరాలు.. రాహుల్‌ను ముందుకు నడవనివ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కో సంక్షోభం ఆ పార్టీని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు సమస్యలు ఎవరికి కన్పించవ్… ఇష్యూ వచ్చినప్పుడే అసలు బండారం బయటపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు ఓవైపు రాహుల్ గాంధీ యాత్ర చేస్తుంటే పార్టీ నేతలు మాత్రం ఉన్న అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి. పక్క పార్టీలోకి వెళ్లి అధికారాన్ని ఎలా అనుభవించాలన్న ముందుచూపుతో పనిచేస్తున్నారు.

ఓవైపు గోవా.. మరోవైపు రాజస్థాన్
మొత్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పీకల్లోతుకు మించిన కష్టాల్లో కూరుకుపోయింది. గోవాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో విలీనమైపోయారు. అంటే గోవాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నమాట. ఇదే సమయంలో రాజస్థాన్‌లో చాన్నాళ్లుగా సాగుతున్న రచ్చను తగ్గిద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా అది మాత్రం సాధ్యం కావడం లేదు. అశోక్, పైలట్ మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నిస్తున్నా… అది సాధ్యం కావడం లేదు. రాజస్థాన్ సీఎం పీఠం మీద ఆశ పెట్టుకున్న గెహ్లాట్ ఆ స్థానం వదలడానికి ససేమిరా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానన్నా వద్దంటున్నాడు. రాజస్థాన్ సీఎం పీఠమే ముద్దంటున్నాడు. అంతేనా కాంగ్రెస్ పార్టీ దూతలుగా జైపూర్ వచ్చినా కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత అజయ్ మాకన్‌ను సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు హైకమాండ్ పెద్దలకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయ్. ఢిల్లీ దూతలను కలవడానికి కూడా గెహ్లాట్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గెహ్లాట్‌ది నయవంచనంటున్న నేతలు
కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా దశాబ్దాల తరబడి పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న అశోక్ గెహ్లాట్ లాంటి నాయకుడికే అటు సోనియా గానీ ఇటు రాహుల్ గానీ నచ్చజెప్పలేకపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చెబుతుంది… ప్రజలకు ఏం భరోసా ఇస్తుంది.. సొంత పార్టీ నేతలను కంట్రోల్‌లో పెట్టడం సాధ్యం కాని నేతలకు.. ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పట్టుకోవడం సాధ్యమవుతుందా? దేశంలో మరోసారి అధికారంలో తీసుకొచ్చేస్తామంటూ గొప్పలు పోతున్న నేతలు… సొంత పార్టీలో లుకలుకలను తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారం కోసం కొట్లాడటం మాని.. పార్టీ బతికించుకోవడంపైనా దృష్టిలేకుండా పోతోంది. ఇప్పుడు రాజస్థాన్ విషయమే చూసుకుందాం.. అశోక్ గెహ్లాట్ పార్టీని విభేదించి.. సీఎం పీఠంపై మరికొద్ది రోజులు గడపాలని ఉవ్వి్ళ్లూరుతున్నరు. ఒకవేళ హైకమాండ్ సచిన్ పైలట్‌కు సీఎం పీఠం అప్పగించాలని చూసినా ఆయన తిరుగుబావుటా ఎగురేసే అవకాశం లేకపోలేదు. ఇక రేపట్నుంచి నువ్వే సీఎం అంటూ సచిన్ పైలట్‌కు ఇచ్చిన హామీలు ఏమవ్వాలి… ఇది రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. ఉన్న నాలుగు రోజులు అధికారాన్ని అనుభవిద్దాం.. తర్వాత సంగతి తర్వాత అన్న రీతిలో ఎమ్మెల్యేలంతా ఉన్న విషాదఘట్టం స్పష్టంగా కన్పిస్తోంది. ఏతావాతా కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి రాజస్థాన్ దర్పణం పడుతోంది.

రాహుల్‌ను ముందుకు నడవనివ్వని నేతలు
ఇవాళ రాజస్థాన్ ఎపిసోడ్ చూశాం… రేపు ఇదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకులు పూర్తి కాలం పదవిలో ఎంజాయ్ చేయాలని భావిస్తుంటే భవిష్యత్తులో అధికారంలో వస్తామా.. రాలేమా అన్న బెంగ కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఎక్కువ మంది నేతలు పదవి పూర్తి కాలం అనుభవించి కాలం గడిపేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని పైకి తేవాల్సిన రాహుల్ గాంధీ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. జనంలో కాన్ఫిడెన్స్ కన్పిస్తున్నా నేతల్లో కన్పించకపోవడం ఏంటని రాహుల్ లబోదిబోమంటున్నాడు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి… కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే లేచి నిలబడే పరిస్థితిలో లేదు. ఐసీయూలో నుంచి జనరల్ వార్డులోకి రావడం కూడా కష్టమే. ఇక సాధారణ స్థితిలోకి ఎప్పుడు వస్తుందో కూడా ఊహించలేం. ఓవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యంతో సతమతమవుతుంటే… ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఆ పార్టీని మరింత గందరగోళంలో పడేస్తున్నాయ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఫేడ్ అవుట్ అయిపోయిన ముఖాలన్నీ మేము సైతం అంటూ ముందుకొస్తుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో సోనియా ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయ్. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఆ పార్టీ నేతల స్వార్థం కకావికలం చేస్తుంటే.. పాపాం రాహుల్ ఏం చేసి.. ఆ పార్టీని అధికారంలోకి తెస్తాడో వేచి చూడాల్సిందే…

