NationalNews

గెహ్లాట్… గెటౌట్, సోనియా ఆదేశాలు

అశోక్ గెహ్లాట్ గాంధీలు అనుకున్నంత పనీచేసేశాడు. రాజస్థాన్ సీఎం పీఠంపై ఉన్న ఆశ చావని గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని తేల్చిచెప్పేశాడు. వాస్తవానికి గాంధీలు ఏరికోరి మరీ అశోక్ గెహ్లాట్‌ను ఏఐసీసీ చీఫ్‌గా నియమించాలని భావించారు. వాస్తవానికి ఆయన ఇవాళ నామినేషన్ సైతం దాఖలు చేయాల్సి ఉంది. కానీ రేసులో లేనని తాజాగా ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తున్నానన్న గెహ్లాట్… అధ్యక్ష పదివికి పోటీ చేయడం లేదని చెప్పారు. రాజస్థాన్‌లో జరిగిన మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి సోనియాకు క్షమాపణలు చెప్పానన్నారు. ఉవాళ ఉదయం సోనియాతో గంటన్నరపాటు చర్చించారు గెహ్లాట్. పార్టీ అధ్యక్షపదవికి పోటీ చేయడం లేదని చెప్పిన గెహ్లాట్.. నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైనకొద్ది సేపటికే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు అధ్యక్ష రేసులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు దిగ్విజయ్ సింగ్ వచ్చిచేరారు. రేపు ఆయన నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాన్ని గాంధీ కుటుంబ సభ్యులతో చర్చించలేదని… అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో అఫిషియల్‌గా పోటీ చేసేదెవరో తేలనుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సైతం పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాంధీ కుటుంబం బయట వ్యక్తి 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బరిలో దిగనున్నారు. మొదట కాంగ్రెస్ అధ్యక్ష రేసులో లేనని చెప్పుకున్న డిగ్గీరాజా… పది నామినేషన్ పత్రాలను తనతో తీసుకెళ్లారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తానన్న ఆయన మొత్తం వ్యవహారంపై తర్జనభర్జన పడుతున్నారు.

అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్‌ను సీరియస్ అయ్యింది. మొన్నటి వరకు కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో మొదటి ఎంపికగా అశోక్ గెహ్లాట్ కనిపించారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత అధినాయకత్వం మనుసు మారిపోయింది. గెహ్లాట్‌ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే, అతని స్థానంలో ఆయన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమిస్తారని సాగుతున్న ప్రచారంతో 90 మందికి పైగా ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ బెదింరిపునకు దిగారు. ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర నాయకులు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే ముందు షరతులు పెట్టడాన్ని కూడా హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. సోనియా గాంధీకి ఇచ్చిన నివేదికలో తిరుగుబాటును “తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా” అభివర్ణించారు. గెహ్లాట్‌కు సన్నిహితులైన ముగ్గురు మంత్రులను అసలు ఆ రోజు ఏం చేశారన్నదానిపై 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.

ఐతే బీజేపీతోపాటుగా కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కాచుక్కూర్చున్న వారు… మొత్తం వ్యవహారాన్ని తిరుగుబాటుదారుడిగా ముద్ర వేయడానికి ప్రేయత్నించాయని గెహ్లాట్ వాపోతున్నాడు. ఏఐసీసీ ఎన్నికలకు ముందుగానే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెహ్లాట్ వైదొలగాలని కాంగ్రెస్ కోరినట్లు వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో తన స్థానంలో ఎవరిని ఎంపిక చేసినా… నాయకత్వ నిర్ణయాన్ని తప్పక గౌరవించాలని పేర్కొంది. పార్టీ చీఫ్‌గా పోటీ చేస్తున్నప్పుడు కూడా రాజస్థాన్‌లో తన పాత్రను కొనసాగించాలని గెహ్లాట్ కోరుకున్నారు.ఒకే వ్యక్తి, ఒకే పదవి అనే సంకల్పానికి కట్టుబడి ఉన్నందున అది సాధ్యం కాదని రాహుల్ గాంధీ గత వారం స్పష్టం చేశారు. సోనియా గాంధీ కూడా రాజస్థాన్‌లో తన కోసం నిరీక్షి,స్తున్న సచిన్ పైలట్‌ను కలిసే అవకాశం ఉంది.