Andhra PradeshNews

ఏపీలో బీజేపీ… బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్

Share with

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మనుగడే లేదు. కానీ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటూ పగటికలలు కంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాన్ని మీడియాకు వివరాలు అందించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు భారత్ జోడో యాత్రపై నిర్ణయముంటుందని చెప్పారు. భారత్ జోడో యాత్ర, సోనియా ఈడీ విచారణ, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీ తాకట్టు  ఈమూడు అంశాలపై చర్చలు జరుపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 100 కిలోమీటర్ల పాదయాత్ర ఉండబోతోందని.. ఏపీలో రాయదుర్గం నియోజకవర్గం నుండి ఈ యాత్ర మొదలవుతుందన్నారు. రెండు పార్లమెంట్, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో నాలుగు రోజులు పాటు సాగుతుందన్నారు. దేశంలో చరిత్ర పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు తులసిరెడ్డి.  గతంలో జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయి , చౌదరి చరణ్ సింగ్ లు ఇందిరా గాంధీని వేధించారు. ప్రజలు తర్వాతి ఎన్నికల్లో జనతా పార్టీకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా సత్యాగ్రహ ఆయుధం ద్వారా బిజెపి కక్ష రాజకీయాలను ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

 సోనియాపై ఈడీ విచారణ పేరుతో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను దీనికోసం ఉపయోగించుకుంటుంది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ అనీ,ఇందులో ఏ ఒక్కరికి ఓటు వేసిన బిజెపికి ఓటు వేసినట్లే అన్నారు.  బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం , మోసం , ద్రోహం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ శనిగ్రహంలా దాపురించిందని, ఈ 8 సంవత్సరాలలో విభజన చట్టంలో ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదని, పోలవరాన్ని కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని, తమ స్వార్థ ప్రయోజనాల  కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. .

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తెస్తామంటూ మూడు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, రాష్ట్రంలో ఈపార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు  విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కాంగ్రెస్సే ఆంధ్రప్రజలకు శ్రీరామరక్ష అనీ దగాకోరు పార్టీలను నమ్మవద్దనీ అన్నారు.