NationalNews

వామ్మో అదానీ… అంబానీని మించిపోయాడు

Share with

ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి మనకు తెలిసిందే. ధనలక్ష్మి కరుణాకటాక్షాల కోసం ప్రతి మనిషీ తపన పడుతుంటాడు. న్యాయంగానో, అన్యాయంగానో చేతనయినంత సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటారందరూ. కానీ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంనుండి ఏకంగా ప్రపంచ కుబేరుల స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ. ఈయన మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కూడా వెనక్కినెట్టి నాలుగోస్థానానికి ఎగబాకాడు. కుటుంబీకులతో కలిపి ఆయన సంపద విలువ మొత్తం 114 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్ సంపద 102 బిలియన్ డాలర్లు. బిల్‌గేట్స్ ఈమధ్యే 20 బిలియన్ డాలర్లు గేట్స్ ఫౌండేషన్‌కు విరాళమిచ్చి ఒక స్థానాన్ని కోల్పోయారు. క్రమంగా విరాళాలు పెంచుకొంటూ కుబేరుల జాబితానుండి బయటకు వస్తానని ఇటీవలే ప్రకటించారు బిల్‌గేట్స్. ఇక మొదటి స్థానంలో 230 బిలియన్ డాలర్లతో  టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండగా, బెర్నార్డ్ ఆర్నార్డ్ 2 వ స్థానంలోనూ, అమెజాన్ అధినేత జఫ్ బెజోస్ 3 వ స్థానంలోనూ ఉన్నారు. మరో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ 10 వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన ఆస్తుల విలువ 88 బిలియన్ డాలర్లు.

అదానీకి లభించిన మరో రికార్డు ఏంటంటే కేవలం ఏడాది కాలంలో ఆయన సంపద రెట్టింపు కావడం విశేషం. అదానీ సాధించిన ఈ విజయం వెనుక 30 ఏళ్లకు పైగా కృషి, ఆశయం ఉన్నాయి. ఈయన ప్రస్థానం తన తండ్రి శాంతిలాల్ అదానీ యొక్క సాదాసీదా వస్త్ర వ్యాపారం నుండి మొదలయ్యింది. అహ్మదాబాద్‌లో బీకాం చదువుకునే రోజుల్లోనే పెద్ద వ్యాపారి కావాలని కలలు కన్నాడు. చిన్నప్పుడు కాండ్లా పోర్టుకు వెళ్లినపుడు ఎప్పటికైనా ఒక పోర్టును నిర్వహించాలనుకున్నాడు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి ముంబై చేరుకుని వజ్రాలను గ్రేడింగ్ చేసేపని చేసారు. సొంతంగా వజ్రాలవ్యాపారం మొదలుపెట్టి 20 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. 1988 లో అదానీ ఎక్స్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 1993 లో గుజరాత్ ప్రభుత్వం నుండి ముంద్రా పోర్టు బాధ్యత స్వీకరించి, చిన్నప్పటి కలను నిజం చేసుకున్నారు. ఇప్పుడు అదానీ గ్రూప్‌లో 7 కంపెనీలు, 12కు పైగా వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ దేశంలోనే పేరు పొందిన సంస్థలు. 8 విమానాశ్రయాలు అదానీ గ్రూప్ నిర్వహణలో ఉన్నాయి.

సోలార్ ఎనర్జీ, ట్రాన్సమీషన్, ఆయిల్ బ్రాండ్స్, గ్యాస్, థర్మల్ పవర్, లాజిస్టిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, రియల్ ఎస్టేట్, రోడ్, రైల్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇందుగలడందులేడన్నట్లు ఆయన కాలుపెట్టని రంగం లేదు. వేలు పెట్టని వ్యాపారం లేదని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా సాధారణ వ్యాపారి స్థానం నుండి వ్యాపార దిగ్గజస్థాయికి ఎదిగిన ఆయనపై కూడా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి కారణం  ప్రధాని మోదీతో అనుబంధం. 2014లో ప్రమాణస్వీకారానికి అదానీ విమానంలో రావడం, 2018లో 6 విమానాశ్రయాల నిర్వాహణను అదానీ గ్రూప్‌కు అప్పజెప్పడం, వంటి సంఘటనలు చాలా మందికి కోపం తెప్పించాయి. కేరళ విమానాశ్రయ నిర్వాహణను 50 ఏళ్లు లీజుకు అదానీకి ఇవ్వడం మోదీ సర్కారుపై విమర్శలకు దారి తీసింది. కానీ విపక్షాల విమర్శలను పక్కన పెడితే మేకిన్ ఇండియా అంటూ పిలుపునిచ్చిన ప్రధాని విదేశీ సంస్థల పెత్తనానికి కాకుండా సరైన నిర్ణయం తోనే భారతీయ కంపెనీలను ప్రోత్సహిస్తూ నేడు ఏకంగా ప్రపంచ కుబేరులతో పోటీపడేస్థాయికి భారత వ్యాపారులను వృద్ధి చెందడానికి సహకరించడం ఎంతైనా ముదావహం.