NewsTelangana

గట్టుప్పల్ మండలం… ఉపఎన్నికకు లింకు…

Share with

సారూ… కారూ… సర్కారు… పదహారు… ఇది 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నినాదం… కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్త నినాదం రాజ్యమేలుతోంది. ఉపఎన్నికలు వస్తేనే… కొత్త పథకాలు.. అభివద్ధి… సంక్షేమం జరుగుతాయని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి సృష్టించారు సీఎం కేసీఆర్. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం వెనుక ఓ ఉపఎన్నిక దాగి ఉందని స్పష్టమవుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న గట్టుప్పల్ మండలం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రత్యేక మండలం కావాలని ఆ ప్రాంత ప్రజలు చాన్నాళ్లపాటు ఆందోళనలు చేశారు. ధర్నాలు, రాస్తరోకోలు ఇలా ఎన్నో రకాల నిరనసలు తెలిపారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో… సిట్యువేషన్ మారిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించింది. 9 గ్రామ పంచాయితీలను కలుపుకుంటూ నల్గొండ జిల్లాలో కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మండలాల పునర్విభజనలో భాగంగా ఆప్పట్లో గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించి… ఆ తర్వాత ప్రభుత్వం వెనకడుగు వేసింది. ప్రత్యేక మండలం కోసం 892 రోజుల పాటు గట్టుప్పల్ గ్రామస్తులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా గట్టుపల్ మండలం ప్రకటించడంతో గ్రామస్తుల సంబరాలు జరుపుకున్నారు. ఐతే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైరైటీ ప్రకటన చేసింది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి 13 కొత్త మండలాలను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్… సీఎస్ ను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీంతో పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిథిల్లో ఏర్పాటయిన నూతన మండలాలను పరిశీలిస్తే… నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ (gundumal) , కొత్తపల్లె(kothapalle) మండలాలు, వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ (dudyal) మండలం, మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల (koukuntla) మండలం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. ఆలూర్ (aloor), డొంకేశ్వర్(donkeshwear) మండలాలు, నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిథిలో సాలూర(saloora) మండలం, మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిథిలో..సీరోల్(seerole) మండలం, నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిథిలో…గట్టుప్పల్ (gattuppal) మండలం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో…నిజాం పేట్ (nizampet) మండలం, కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. డోంగ్లి (dongli) మండలం, జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిథిలో.. ఎండపల్లి(endapally) మండలం, జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిథిలో, భీమారం(bheemaram) మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.