InternationalNews

వెయిటర్‌ నుంచి ప్రధాని దాక..

బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రిషి సునక్‌ తొలి ఉద్యోగం ఏంటో తెలుసా..? వెయిటర్‌ ఉద్యోగం..! మే 12, 1980లో సౌతాంప్టన్‌లో జన్మించిన సునక్‌ పాఠశాల విద్యను వించెస్టర్‌ కళాశాలలో పూర్తి చేశారు. అది ఆరుగురు ఛాన్సలర్లను తయారు చేసిన ప్రైవేటు కళాశాల. పాఠశాలకు వేసవి సెలవులు ప్రకటించినప్పుడు సౌతాంప్టన్‌లోని ఇండియన్‌ రెస్టారెంట్‌లో సునక్‌ వెయిటర్‌గా పని చేశారు. అది ఆయన తొలి ఉద్యోగం. టేబుళ్లను అమర్చడం, వాటిని తుడవడం, మూసివేసిన తర్వాత మరుసటి రోజుకు వాటిని మళ్లీ సిద్ధం చేయడం, బిల్లులు సేకరించడం.. ఇవీ తన పనులు అని సునక్‌ చెప్పారు.

బ్యాంకులో అనలిస్టుగా..

కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ ఆ ఉద్యోగం తనకు ఎంతో నేర్పించిందని ఓ ఇంటర్వ్యూలో సునక్‌ తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత 2001 నుంచి 2004 వరకు ఆయన గోల్డ్‌మన్‌ శాచ్స్‌ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో అనలిస్ట్‌గా పని చేశారు. హెడ్జ్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, చిల్డ్రన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేసిన సునక్‌ 2006లో అందులో భాగస్వామి అయ్యారు. 2009లో ఆ సంస్థలను వదిలి.. హెడ్జ్‌లోని తన మాజీ సహోద్యోగులతో కలిసి 2010లో కాలిఫోర్నియాలో థెలీమ్‌ పార్ట్నర్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు. 2013-15 మధ్య కాలంలో నారాయణ మూర్తికి చెందిన కాటామారన్‌ వెంచర్స్‌లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

బ్రిటన్‌ ప్రధానిగా అతి పిన్న వయస్కుడు..

2015లో రాజకీయాల్లోకి ప్రవేశించిన సునక్‌ కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2017, 2019లోనూ మరో రెండుసార్లు గెలిచారు. 2019-20 కాలంలో ట్రెజరీ చీఫ్‌ సెక్రటరీగా చేశారు. 2020 నుంచి 2022 జూలై 5వ తేదీ వరకు బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గత 200 ఏళ్లలో బ్రిటన్‌ను పాలించిన నేతల్లో అతి పిన్న వయస్కుడిగా సునక్‌ రికార్డు సృష్టించారు. అంతేకాదు.. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి హిందువుగానూ రికార్డు సొంతం చేసుకోనున్నారు. బ్రిటన్‌ ఎంపీల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.