రాధాకృష్ణన్ నుండి ధన్ ఖడ్ వరకు…
భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్ ఖడ్ విజయం సాధించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌ఖఢ్ గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలయ్యాయి. అందులో 528 ఓట్లు ఆయన సాధించారు. చెల్లని ఓట్లు 15గా తేలాయి. విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 725 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోగా.. 92.94 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 11న ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికలంటే దేశం చూపు మొత్తం అటువైపే ఉంటుంది. ఆసక్తిని రాజేస్తుంది. విజేత ఎవరన్న ఉత్సుకతను కలిగిస్తుంది. ఈ రాజ్యాంగ పదవులకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్ధులే విజయం సాధించడం సహజం. కానీ .. కొన్ని కొన్ని పర్యాయాలు తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికలు కూడా ఎన్నో. విపక్షాలు బలపరిచిన అభ్యర్ధి గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలూ లేకపోలేదు. అవి రాష్ట్రపతి ఎన్నికలైనా.. ఉప రాష్ట్రపతి ఎన్నికలైనా. రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైన రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రతి పదవే. సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి జగదీప్ ధన్ ఖడ్ వరకు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన వారి వివరాలు, విశేషాలపై ఓ లుక్కేద్దాం.
ప్రపంచంలో అత్యున్నత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్ధ కలిగిన దేశంగా భారత్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. బలోపేతమైన రాజ్యాంగ వ్యవస్ధ ఉంది. ఆ వ్యవస్ధలో రాష్ట్రపతి పదవి తర్వాత రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉప రాష్ట్రపతి పదవే. ఇప్పటి వరకు ఈ పదవికి అనేక మంది వన్నె తెచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి ఎం. వెంకయ్య నాయుడు వరకు ఎంతో మంది ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టారు. అయితే అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన వారిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రధములు. 1952 మే 13వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన 1962 మే 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1952లో రాధాకృష్ణన్ పై విపక్ష అభ్యర్ధిగా ఖాదిర్ హుస్సేన్ ను పోటీకి దింపినా .. సరిగ్గా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఖాదిర్ హుస్సేన్ నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. దశాబ్దకాలం పాటు ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన ఘనత రాధాకృష్ణన్ కే దక్కింది. ఎవరైనా రెండు పర్యాయాల కంటే ఎక్కువసార్లు ఈ పదవిలో కొనసాగకూడదన్న సాంప్రదాయాన్ని ఆయనే ప్రవేశ పెట్టారు. అయితే 1957లో కూడా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతికి ఎంపికయ్యారు. అలా.. ఆయన పదేళ్ళ పాటు పదవిలో కొనసాగారు. ఇక రాధాకృష్ణన్ తర్వాత పదేళ్ళ పాటు ఉపరాష్ట్రపతిగా పని చేసిన ఘనతను మహ్మద్ హమీద్ అన్సారీ సొంతం చేసుకున్నారు. 2007 ఆగస్ట్ 11 న భైరాన్ సింగ్ షెకావత్ పై గెలుపొందిన ఆయన 2017 ఆగస్ట్ 10 వరకు పదవిలో కొనసాగారు. 2012లో జస్వంత్ సింగ్ పై విజయం సాధించి రెండవ దఫా కూడా ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగారు. సర్వేపల్లి రాధాకృష్ణన్.. హమీద్ అన్సారీలు మాత్రమే ఇప్పటి వరకు అత్యధికాలం ఉపరాష్ట్రపతులుగా పని చేసి రికార్డుల కెక్కారు.
భారత ఉపరాష్ట్రపతిగా పని చేసిన మొదటి ముస్లిం నేత జాకీర్ హుస్సేన్. 1962 మే 13 నుండి 1967 మే 12 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. సమంతాసిన్హాపై ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఉపరాష్ట్రపతిగా పని చేసిన తొలి దళిత నేత కే. ఆర్ నారాయణన్ ప్రసిద్ధి చెందారు. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన కాకా జోగీందర్ సింగ్ పై ఆయన ఘన విజయం సాధించి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు. తన పదవీకాలంలో ముక్కుసూటిగా, క్రియాశీలకంగా వ్యవహరించి ఎంతో మంది మన్ననలు పొందారు. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా ఆమోదించే వాడు కాదని ఆయనకు పేరు. ఎన్నో విషయాలలో ఆయన నిక్కచ్చిగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించారు. అందుకే ప్రజాస్వామ్య వాదులు నారాయణన్ అంటే అమితంగా ఇష్టపడే వారు. ఇక ఉపరాష్ట్రపతిగా అతి తక్కువకాలం పని చేసింది మాత్రం వి.వి. గిరి. 1967 మే 13 నుండి 1969 జులై 20 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఇక పదవిలో ఉండగా మృతి చెందిన నేత కృష్ణకాంత్. 1997 ఆగస్ట్ 21న సూర్జిత్ సింగ్ బర్నాలాపై విజయం సాధించి పదవీ బాధ్యబాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్ .. 2002 జులై 27న పదవిలో ఉండగానే మృతి చెందారు.
ఇప్పటి వరకూ మహిళలు ఎవరూ ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టలేదు. అయితే ఆ పదవికి తొలిసారి పోటీ చేసిన ఘనత మాత్రం మార్గరెట్ ఆల్వాకే దక్కింది. ప్రస్తుతం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్ధిగా జగదీప్ ధన్ ఖడ్ పోటీ చేస్తే .. ఆయనపై కాంగ్రెస్ పక్షాలు బలపరిచిన అభ్యర్ధిగా మాజీ కేంద్రమంత్రి మార్గెట్ ఆల్వా పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. మొదటిసారిగా ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళా నేతగా ఆల్వా ఓ రికార్డు నెలకొల్పారు.
ఇప్పటి వరకు ఉపరాష్టపతులుగా పని చేసిన వారిలో డాక్టర్ గోపాల్ స్వరూప్ పాఠక్, బీడీ జెట్టి, మహ్మద్ హిదయతుల్లా, ఆర్. వెంకటరామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, భైరాన్ సింగ్ షెకావత్, ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉన్నారు. ఇప్పుడు దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ ఎన్నికయ్యారు.