గతంలో హైటెక్ సిటీ- ఇప్పుడు శ్రీసిటీ..సీఎం
ఏపీ ప్రభుత్వ అధ్వర్యంలో శ్రీ సిటీలో 8 వేల ఎకరాలలో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో టీడీపీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీని నిర్మించామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు, ఉపాధి, సంపదను సృష్టించగలరని, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వం సంక్షేమం, సాధికారతలను అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ నిపుణులకు ప్రత్యేక నైపుణ్యం ఉందన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, ప్రతీ నలుగురు ఐటీ నిపుణులలో ఒక భారతీయుడు ఉంటే, వారిలో ప్రతీ నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారని గర్వంగా చెప్పగలనన్నారు. శ్రీ సిటీలోని సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్ అనే విభాగాలు ఉంటాయని, వాటిలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యామన్నారు. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. చెన్నై, తిరుపతి, కృష్ణపట్నం ప్రాంతాలకు ఈ శ్రీసిటీ చాలా దగ్గరగా ఉందని, దీనిని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా ఏర్పాటు చేయాలన్నదే తన ఆశయం అన్నారు.

