NationalNews

బలవంతపు మతమార్పిడి తీవ్రమైనదే

దేశంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులు చాలా తీవ్రమైన అంశమని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రముఖ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ హిమా కోహ్లీల నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్య అయినందున బలవంతపు, మోసపూరిత మత మార్పిళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

సుభాష్‌ చంద్రబోస్‌పై పిల్‌ కొట్టివేత..

ప్రముఖ స్వాంతంత్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. నేతాజీ జనవరి 23, 1897లో కటక్‌లో జన్మించారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించాలంటూ పిల్‌ దాఖలు చేయడం ద్వారా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌ కె.కె.రమేష్‌ను సుప్రీం కోర్టు మందలించింది. దేశానికి నేతాజీ అందించిన సేవలను గుర్తించాలంటే కష్టపడి పని చేయాలని.. సెలవు తీసుకోవడం కాదని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఇది న్యాయ పరిధిలోని అంశం కాదని.. భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు.