InternationalNewsNews Alert

పాకిస్థాన్‌లో వరద బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటన

పాకిస్థాన్‌ను ఇప్పుడు ఆ దేశ అర్థిక సంక్షోభం కంటే అత్యంత భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెలలో కురిసిన భారీ వర్షాల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 937 మంది మృతి చెందారు. ఇందులో 343 మంది చిన్నారులు ఉండడం హృదయ విదారకం. సుమారు 3 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం గురువారం నేషనల్ఎ‌ మర్జెన్సీ ప్రకటించింది. పాక్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యధికంగా సింధ్‌ ప్రావిన్స్‌లో 306 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ ప్రావిన్స్‌లో 165 మంది మృతి చెందారు. బలూచిస్థాన్‌లో 234 మరణాలు.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 185 మరణాలు నమోదయ్యాయి.

పాకిస్థాన్‌లో ఏటా ఆగస్టులో కురిసే సాధారణ వర్షపాతం 48 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది సుమారు 241 శాతం అధికంగా 166.8 మిల్లీమీటర్లు నమోదు కావడం గమనార్హం. వరదలతో అస్తవ్యస్తమైన సింధ్‌లో 784 శాతం, బలూచిస్థాన్‌లో 496 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు కారణమయ్యాయని పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి షెర్రీ రెహమాన్‌ తెలిపారు. వరద పరిస్థితులపై గురువారం ఆమె మాట్లాతూ.. సహాయక చర్యల సమన్వయానికి ఎన్‌డీఎంఏలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారులతో సమావేశమై ‘వార్ రూమ్’ని ఏర్పాటు చేశారని మంత్రి షెర్రీ రెహమాన్‌ తెలిపారు. 2010లోని వరదలతో పోలిస్తే.. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.