బురద నీటిలో స్నానం… వినూత్న నిరసన…
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లోని రోడ్లు చెరువులుగా మారాయి. ఈ నేపథ్యంలోనే తమకు స్థానికంగా ఉన్న రహదారుల దుస్థితిని అధికారులు, రాజకీయా నాయకుల దృష్టికి తెచ్చేందుకు ఓ వ్యక్తి వినూత్న కార్యక్రమం చేశాడు. రోడ్లు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు బురద నీటిలోనే స్నానం చేస్తూ, అక్కడే యోగసనాలు కూడా చేశాడు. దీంతో స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన అక్కడికి చేరుకొని.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన కేరళలోని పాండిక్కాడ్ జిల్లా మలప్పురంలో జరిగింది.
ఇటీవలి వర్షాలకు అనేక చోట్ల గుంతలు పడి రోడ్లపై బురద నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎన్నోసార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసిన ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన హమ్జా పొరాలి అనే స్థానికుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఈ వ్యవహారాన్ని స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.