గోవాలో క్లబ్ లో అగ్ని ప్రమాదం – 25 మంది సజీవ దహనం
ఉత్తర గోవాలోని అర్పోరాలోని ఒక నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 25 మంది సజీవ దహనంతో పాటు, మరో 50 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు మోదీ తెలిపారు. ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని,మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేశారు.
బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లబ్ సరైన నిబంధనలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఈ ప్రమాద ఘటనలో 25 మంది మృతులలో ముగ్గురు మహిళలు, నలుగురు విదేశీ పర్యాటకులతో పాటు మిగిలిన వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించినట్లు గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ వివరించారు. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనం కాగా , 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రాలపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2013లో ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసిన రోషన్ రెడ్కార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

