APSRTC బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం-తప్పిన ప్రాణగండం
ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన బస్సు ఇంజన్లో మంటలు రావడంతో బస్సు కాలి బూడిదైన సంఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద జరిగింది. గుడివాడ నుండి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో అనుకోని ఘోర ప్రమాదం జరిగింది. ఇంజన్లో నుండి హఠాత్తుగా మంటలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై బస్సును నిలిపివేసి అందరినీ దిగిపొమ్మని హెచ్చరించారు. దీనితో ప్రయాణీకులు, విద్యార్థులు అందరూ కిందకి దిగిపోయారు. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. ఈ బస్సులో ప్రమాద సమయానికి విద్యార్థులు, ఇతర ప్రయాణీకులు కలిపి 60 మంది ఉన్నారు. కిందకు దిగే కంగారులో చాలామంది తమ వస్తువులను బస్సులోనే వదిలేయడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. కొందరు ప్రయాణీకులు వారి, నగదు, బంగారం, దుస్తులు కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోనికి తెచ్చారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

