NewsTelangana

ఎయిర్‌ పోర్ట్‌ వరకు ‘మెట్రో’ విస్తరణ.. 9న శంకుస్థాపన

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ విస్తరించే ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సీఎం కేసీఆర్‌ ఈ నెల 9వ తేదీన రాయదుర్గంలో శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం నుంచి చేపట్టే నిర్మాణ పనులకు సంబంధించిన బిడ్‌ను మంగళవారం నుంచి 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీల ప్రీ బిడ్‌ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు విస్తరించే మెట్రో రైల్‌ ప్రాజెక్టులో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌తో పాటు హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ భాగస్వాములవుతాయి.

మూడేళ్లలో పూర్తి..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్‌ నగరానికి అనుసంధానించే ఈ మెట్రో ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు మెట్రో కారిడార్‌ విస్తరణ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లే ఈ మెట్రోలైన్‌ బయో డైవర్సిటీ జంక్షన్‌ కాజాగూడా రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని నానక్‌రామ్‌ గూడ జంక్షన్‌ను కలుపుతూ వెళ్తుంది. 31 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గం వెంబడి అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు వెలువడతాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,250 కోట్లు ఖర్చు చేయనుంది.