పూరీ రథయాత్రకు సర్వం సిద్ధం..భారీగా తరలి వచ్చిన భక్తులు..
పూరీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర నేడు ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లెలు సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.

