అందరి దృష్టి మునుగోడు పైనే..!
తెలంగాణాలో అందరి దృష్టీ మునుగోడుపైనే ఉంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ పెద్దల కన్నూ ఈ నియోజక వర్గంపైనే పడింది. త్వరలో ఉప ఎన్నిక జరిగే మునుగోడులో అప్పుడే రాజకీయ హీట్ పెరిగింది. ఇంకా నోటిఫికేషనే రాలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అప్పుడే ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా తలపిస్తున్నారు. పాదయాత్రలతో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన ఆయా పార్టీలు బహిరంగ సభలకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. రసవత్తరంగా సాగుతున్న ఈ ముక్కోణపు పోరు సందర్భంగా తమ పార్టీల్లోకి చేర్చుకునేందుకు సర్పంచులు, ఎంపీటీసీలకు, గల్లీ నాయకులకు సైతం గాలం వేస్తున్నారు. మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో వ్యూహాలు రచించేందుకు నాయకులు రాత్రింబవళ్లు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.