చేనేత ప్రమోషన్‌కు రంగంలోకి కీలక ఐఏఎస్ అధికారి
ఇప్పటివరకు ఎన్నో రకాల సంస్థలు వాటి సేల్స్ ను అమాంతం పెంచే విధంగా సినిమా తారలు,వ్యాపార రంగ ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించడం చూసే ఉంటాం.ప్రపంచంలోని పేరుగాంచిన బ్రాండ్లు సహితం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రీడాకారులు, గాయకులు ,డ్యాన్సర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి వారి కంపెనీ సేల్స్‌ను విపరీతంగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటి నేపథ్యంలో మన దేశంలోని స్వదేశీ చేనేత వస్త్రాల కొనుగోళ్లను పెంచడానికి స్వయాన ఐఎఎస్ అధికారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ.. నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.ఈ విషయంలో తెలంగాణ సీఎంవో కీలక అధికారి స్మిత సభర్వాల్ ముందంజలో ఉన్నారు. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్మిత సభర్వాల్ ఒక చేనేత వస్త్రాన్ని ధరించి ఆ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ లుక్‌లో చాలా మోడ్రన్‌గా ఉన్నారు మేడం అంటూ నెటిజన్లు ప్రశంశల జల్లు కురిపించారు. అంతే కాకుండా ట్విట్టిర్‌లో ఈ ఫోటోను వైరల్ చేశారు. ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ తన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ… తెలంగాణాలోని పలు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన పలు ఐఎఎస్ అధికారులు పలు రకాల చేనేత వస్త్రాలను ధరించి ఆ ఫోటోలను తమ ట్విట్టర్ అంకౌంట్లలో పోస్ట్ చేశారు. దీంతో స్వదేశీ చేనేత వస్త్రాలకు బాగా డిమాండ్ పెరిగి కొనుగోళ్ళు పెరిగితే చేనేతలకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ది కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని సీనియర్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.