NewsTelangana

మునుగోడులో గెలిచినా.. టీఆర్‌ఎస్‌ వెన్నులో వణుకు

మునుగోడులో గులాబీ జెండా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ 10,201 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ 95,328 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 85,127 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అయితే.. ఇంత చెమటోడ్చిన తర్వాత కూడా ఇంత తక్కువ మెజారిటీతో లభించిన విజయాన్ని టీఆర్‌ఎస్‌ జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సునాయాసమేమీ కాదని.. మునుగోడు స్థాయిలో పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసినా కేసీఆర్‌కు విజయంపై ధీమాతో ఉండే పరిస్థితి లేదని ఈ ఫలితం నిరూపించింది. బీజేపీ భారీ స్థాయిలో పుంజుకుందని.. ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ సవాలే విసురుతుందని కమ్యూనిస్టు గడ్డ అయిన మునుగోడులో కమలం వికసించిన తీరే నిదర్శనంగా నిలిచింది.

బీజేపీ గట్టి పోటీ.. టీఆర్ఎస్‌కు స్వల్ప ఆధిక్యత..

దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌కు తొలి రౌండ్‌ నుంచే బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. 15 రౌండ్ల కౌంటింగ్‌లో 2, 3, 15వ రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధించింది. అయితే.. ఈ ఎన్నిక ఏకపక్షంగా జరగలేదన్నది ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యతే లభించింది. తొలుత 2, 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడంతో ఒకానొక దశలో కమలం పుంజుకుంటుందా..? అనే అనుమానాలు రేకెత్తించింది. అయితే.. కాంగ్రెస్‌ ఓట్లను తన వైపునకు పూర్తి స్థాయిలో తిప్పుకోవడంలో రాజగోపాల్‌ రెడ్డి విఫలమయ్యారు. మరోవైపు సిట్టింగ్‌ స్థానంలోనూ కాంగ్రెస్‌కు డిపాజిట్‌ దక్కలేదంటే.. ప్రజల్లోకి బీజేపీ ఏ స్థాయిలో దూసుకెళ్లిందో తెలుస్తోంది.

రాజగోపాల్‌కు సైలెంట్‌ ఓట్లు..

మరోవైపు ఈ ఎన్నికను సీఎం కేసీఆర్‌ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే.. గ్రామానికి ఒక ఎమ్మెల్యేను, మండలానికి ఒక మంత్రిని నియమించి పోల్‌ మేనేజ్‌మెంట్‌ను పకడ్బందీగా చేశారు. ఇతర ఉప ఎన్నికల మాదిరిగానే దీన్నీ టీఆర్‌ఎస్‌ లైట్‌గా తీసుకుని ఉంటే రాజగోపాల్‌ రెడ్డి విజయం ఖాయమయ్యేది. ఇంత చేసినా బీజేపీకి సైలెంట్‌ ఓటింగ్‌ పడిందని ఫలితాలు నిరూపించాయి. అయితే.. రాజగోపాల్‌ రెడ్డి భారీగా ఆశలు పెట్టుకున్న చౌటుప్పల్‌లో మాత్రం ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉండటం.. కమ్యూనిస్టులకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండటం కూడా రాజగోపాల్‌ రెడ్డి పోరాటానికి ఫలితం దక్కకుండా చేసింది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారారని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం కింది స్థాయి ప్రజల్లోకి పాకింది.

మెజారిటీపై టీఆర్‌ఎస్‌ అసంతృప్తి..

విజయం దక్కినా టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజారిటీ పట్ల ఆ పార్టీ నేతలు సంతోషంగా లేరనే విషయం స్పష్టమవుతోంది. 25 వేలకు పైగా మెజారిటీతో బీజేపీకి సమాధానం చెప్పాలనుకున్న కేసీఆర్‌.. 11 వేల పైచిలుకు మెజారిటీ చూసి నీరుగారిపోయారనే చెప్పాలి. బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో బీజేపీ నుంచి ఈ స్థాయి ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేదు. ఎలాంటి కేడర్‌ లేని మునుగోడులోనే 86,697 ఓట్లు సాధించిన బీజేపీ రాష్ట్రంలోని పట్టున్న ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎన్ని ఓట్లు సాధిస్తుందో అనే భయంతో కేసీఆర్‌ నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి.. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు బీజేపీ వెన్నులో వణుకు పుట్టించిందనే చెప్పాలి.