NewsTelangana

మోడీ దెబ్బకు కేసీఆర్ అబ్బా అనాల్సిందే-ఈటల

Share with

బీజేపీ జాతీయ సమావేశాలు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్నందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఈ సందర్భంగా ఆయన బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ భారతానికి ముఖ ద్వారం తెలంగాణ ఉందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో అధికారాన్ని బీజేపీ చేపట్టిందన్నారు. 20వ రాష్ట్రంగా తెలంగాణలో బీజేపీని గెలిపించుకోవాలని జాతీయ నాయకత్వం… జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోందన్నారు.

బీజేపీ కార్యక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు… 33 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా ధనంతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వేశారని… వాస్తవానికి తెలంగాణ ప్రజలు… కేసీఆర్ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదన్నారు రాజేందర్. ఇక్కడి చెల్లని ముఖం ఇతర రాష్ట్రాల్లో చెల్లుతుందా.. అని ఈటల ప్రశ్నించారు. ఇక్కడ జీతాలు ఇవ్వలేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. 300 కోట్లు పెట్టి హిందీ, ఇంగ్లీష్ ఇతర భాషల్లో యాడ్స్ వేశారని దుయ్యబట్టారు. ఉద్యోగులు జమ చేసుకున్న డబ్బులు వాడుకొని దివాలా తీశారని విమర్శించారు ఈటల. హైదరాబాద్ సమావేశాల్లో బీజేపీ తీసుకునే నిర్ణయాల గురించి దేశమంతా చూస్తోందన్నారు.

కేసీఆర్‌ని తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బొంద పెట్టాలని… ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కేసీఆర్ పార్టీని బొంద పెట్టాలని ప్రజలు చూస్తున్నారన్నారు. అది బీజేపీతోనే సాధ్యమని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో రాహుల్ గాంధీ, కేటీఆర్ చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని…. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఎవరికి ఓటు వేసిన ఒకటేనన్నారు ఈటల. పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రావాలన్నారు. కేసీఆర్‌కి చెంప పెట్టులాంటి సందేశాన్ని సభ ద్వారా మోడీ పంపిస్తారన్నారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన… అధిక సభ్యత్వం గల పార్టీ బీజేపీ అన్నారు ఈటల. ప్రపంచంలోనే మోడీ ప్రతిష్ట వెలిగిపోతోందని… దేశం అభివృద్ధి వైపు ముందుకు సాగుతుందన్నారు.