‘పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోం’..సుప్రీం మండిపాటు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని, అత్యవసరంగా మూడు సెలవు రోజులలో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారన్న ఫిర్యాదు రావడంతో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం మండిపడింది. చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఈ కేసులో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చి, దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.


 
							 
							