InternationalNews

అధ్యక్ష బరిలో ప్రేమదాస

Share with

తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు.అదేవిధంగా ప్రధాని సింఘే కూడా తన పదవిని వదులుకుంటానని చెప్పారు.మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగానే పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.లంకలో నూతన ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ(ఎస్‌జేబీ)ప్రకటించింది.శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస తాను దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రస్తుతం ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఒక దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని సోమవారం మీడియాకు తెలిపారు.

జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్‌ మహింద యప అబేయవర్దనే సోమవారంప్రకటించారు.ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ దేశం విడిచిపారిపోలేదని.. దేశంలోనే ఉన్నారని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ ఏం చెప్పినా, ఎలాంటి ప్రకటన చేసినా.. అది స్పీకర్‌ ద్వారానే వెల్లడిస్తారని అధ్యక్ష కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్‌ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లోసేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు.