డ్రాగన్ దుశ్చర్య- డోక్లాం వద్ద గ్రామం నిర్మాణం
డ్రాగన్ కంట్రీ చైనా కుతంత్రాలకు అంతు లేకుండా పోతోంది. డోక్లాం దగ్గర భూటాన్‌కు సమీపంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మిస్తోందని తాజా శాటిలైట్ ఇమేజ్‌ల వల్ల భారత ప్రభుత్వం తెలుసుకుంది. అవసరమైన చర్యలు తీసుకున్నామని, జాతీయ భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించమని చైనాను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఎవరినీ ఉపేక్షించమని, కేంద్రం తెలియజేసింది. పంగ్డా అనే పేరుగల ఈ గ్రామం కిందటి ఏడాది నుంచి ప్రముఖంగా వార్తల్లోకెక్కుతోంది. ఈమధ్య అక్కడ ఇళ్ల ముందు కార్ పార్కింగ్‌కు సంబంధించి శాటిలైట్ ఇమేజ్‌లు కూడా బయటకు వచ్చాయి. మరోవైపు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. దీంతో సరిహద్దు భద్రతపై భారత్‌లో ఆందోళన ఏర్పడింది.

మొత్తం వ్యవహారంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరింద బాగ్చి స్పందిస్తూ దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. అయితే డోక్లాం సమీపంలో చైనా కార్యకలాపాలకు సంబంధించిన వార్తలపై తాను వ్యాఖ్యలు చేయనని.. దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతుందని, భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని, ఆప్రదేశంలో నిఘాను ఎక్కువ చేసామని బాగ్చి పేర్కొన్నారు. దేశప్రజలు ఆందోళన చెందవద్దని, తెలిపారు.