300 వార్డుల ముసాయిదా నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణ, వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో, హైదరాబాద్ మహానగరం విస్తీర్ణం, జనాభా భారీగా పెరిగింది. పాత 150 వార్డుల జనాభాతో పాటు విలీనమైన మున్సిపాలిటీల జనాభా కలిపి కోటి 30 లక్షలకు చేరుకున్నట్టు అధికారులు అంచనా వేశారు.
ఈ పెరిగిన జనాభాకు అనుగుణంగానే పాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం జీఓ నెం.266ను సోమవారం జారీ చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు, 300 వార్డులకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ ను బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేయనున్నారు. దీంతో పాటు, ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగనుంది.
ప్రజలు, వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ప్రతి అభ్యంతరాన్ని, సలహాను ఆలస్యం చేయకుండా, ఏ రోజుకు ఆ రోజే క్లియర్ చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రజలు తమ అభ్యంతరాలను కేవలం లిఖితపూర్వకంగా మాత్రమే సమర్పించాలి. వీటిని సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లకు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లకు, అలాగే ప్రధాన కార్యాలయంలో కూడా సమర్పించవచ్చు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సర్కిల్ కార్యాలయాల్లోనూ ఈ ఏర్పాట్లు చేశారు. పారదర్శకత, వేగవంతమైన పరిష్కారం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వార్డుల పునర్విభజన అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, గత 10 రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు రాత్రింబవళ్లు పనిచేసి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ G టౌన్ ప్లానింగ్ అధికారులు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ డీలిమిటేషన్ను డిజైన్ చేశారు.ప్రతి వార్డు పునర్విభజనలో 45 వేల జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు.
అయితే, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తెల్లాపూర్ మున్సిపాలిటీ వంటి ప్రాంతాలలో పరిధి పెద్దగా ఉన్నా, జనాభా తక్కువగా ఉన్నా వార్డులను అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఆరు జోన్ల సంఖ్యను పది జోన్లకు పెంచారు. మొత్తం 300 వార్డులు, 50 సర్కిళ్లు, 10 జోన్లుగా డిజైన్ చేశారు.ఒక వార్డు రెండు సర్కిళ్ల పరిధిలోకి రాకుండా సరిహద్దులను పక్కాగా నిర్ణయించారు. ఒక్కో జోన్లో 30 వార్డులు, 5 సర్కిళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
భవిష్యత్తులో చేపట్టనున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని, ఒక వార్డు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను పరిష్కరించిన తర్వాతే తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంతకుముందు, ఈ పునర్విభజన ప్రతిపాదనను ఈ నెల 18న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి కమిటీ సభ్యుల ఆమోదం తీసుకోనున్నారు.
అనంతరం జనవరి మొదటి వారంలో నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలోనూ దీనిని చర్చించి ఆమోదం పొందాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. విలీనం, వార్డుల పెంపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ, ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాను బట్టి 300 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఇంకా సమయముందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తే, ఎన్నికల సంఘం,జీహెచ్ఎంసీ , రెవెన్యూ అధికారులు కలిసి ఈ రిజర్వేషన్లను తేల్చనున్నారు.

