కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న ధైర్యం రేవంత్‌కి లేదా?
సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఈసారి మజ్లిస్ బ్రదర్స్‌పై దాడి తీవ్రతరం చేశాడు. మొన్నటి వరకు హిందూ-ముస్లిం వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ ఇప్పుడు ఓల్డ్ సిటీలో కీలకంగా వ్యవహరించే మజ్లిస్ అధినేతలపై విరుచుకుపడ్డాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాలువలు, నదులు ఆక్రమించినవారిని వదలనంటున్నారని, ఆయన మజ్లిస్ అధినేతల ఆక్రమాలపై కూడా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లాది రూపాయలు సంపాదించారని మండిపడ్డారు. కాలువలు, సరస్సులను ఆక్రమించుకొని ఓవైసీ సోదరులు, ఎడ్యుకేషన్ అంటూ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతంగా చేస్తున్న హైడ్రా ఉద్యమం ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. FTL, సరస్సుల బఫర్ జోన్లలో ఉల్లంఘనలపై దూకుడు పెంచాలని కోరారు. తన విద్యాసంస్థను కూల్చివేయడానికి ప్రయత్నిస్తే 40,000 మంది విద్యార్థులతో ఆందోళన చేస్తానని రేవంత్ రెడ్డిని బెదిరించారంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఒవైసీ సోదరుల వ్యాఖ్యలకు భయపడొద్దని రాజా సింగ్ సీఎంను కోరారు. గతంలో ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ జైల్లో ఉంచి, ఆయన సత్తా చాటారన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాలువలు ఆక్రమించినవారిని వదలొద్దన్నారు.

