భార్యతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోటో షూట్… నెటిజన్లు ఫైర్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర విమర్శలో చిక్కుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది, నాలుగు నెలలుగా రష్యా దాడులు చేస్తూనే ఉంది. క్రమ క్రమంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తోంది. ఇటు ఉక్రెయిన్ సైన్యం శక్తి మేర పోరాటం చేస్తోంది. కానీ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనుకాడకుండా ప్రతిదాడులు చేయిస్తున్నారు. యుద్దం నుంచి తమ దేశ ప్రజలకు కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాయి. అలాంటి నేత ఇప్పుడు విమర్శల పాలయ్యారు
అయితే.. ప్రస్తుతం ఓ పక్క యుద్దంతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ భార్య ఒలేనాతో కలిసి ఫోటో షూట్‌లో పాల్గొనడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రముఖ మ్యాగజైన్ అయిన ‘వోగ్’ కోసం జెలెన్‌స్కీ దంపతులు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష భవనంలోనే ఈ ఫొటోషూట్ జరిగింది. యుద్ధ పరిస్థితులకు దర్పణం పట్టేలా సైనికులు, యుద్ధ ట్యాంక్‌లు, ధ్వంసమైన విమానాలతోనూ ఒలేనా మరికొన్ని ఫొటోలు దిగారు. ఈ చిత్రాలు ఉక్రెయిన్ ప్రధమ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో రావడం సాధారణ విషయం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ఫొటోలు వోగ్ కవర్ పేజీపై రావాలని కలలు కంటారని రాసుకొచ్చారు. తమ కల నెరవేరిందన్నారు. అందుకు యుద్ధం కారణం కాకూడదని అనుకుంటున్నానన్న ఒలెనా ఉక్రెయిన్‌లోని ప్రతి మహిళా తన స్థానంలో కవర్ పేజీపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అయితే, ఈ ఫొటోషూట్ తర్వాత జెలెన్‌స్కీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న వేళ జెలెన్‌స్కీ ఇలా ఫొటోషూట్‌లో పాల్గొన్నారంటే నమ్మలేకపోతున్నామని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం వారికి అనుకూలంగా పోస్టులు చేస్తున్నారు