షూటింగ్‌ల బంద్… రూల్స్ ఫాలో కావాల్సిందేనన్న నట్టి కుమార్
ఇటీవల సినిమా రంగంలో తలెత్తిన పలు సమస్యల నేపథ్యంలో భాగంగా టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ కమిటీ ఇప్పటికే అనేక మార్లు సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలలో సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా నెలకొన్న అనేక పరిస్థితులపై ఫిలిం ఛాంబర్ కమిటీ సభ్యులు చర్చించారు. అయితే ఈ చర్చల్లో భాగంగా టాలీవుడ్‌లో కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలకు సూచించింది. అనంతరం మళ్ళీ ఇంకొకసారి సమావేశం నిర్వహించి ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని..ఈ విషయంపై మరోమారు చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ కమిటీ నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌లో దిల్ రాజు చిత్రీకరణల బంద్‌కు పిలుపునిచ్చారు. దీని ప్రకారం ఫిలిం ఛాంబర్ కూడా అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిపి వేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేడు బైలింగ్వల్ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. దాదాపు 16 సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయని… ఆ సినిమాలకు వర్క్ చేసేది తెలుగు టెక్నిషియన్సే అన్నారు. కాబట్టి అందరూ చిత్రీకరణలు ఆపాల్సిందేనని ఆదేశించారు. అంతే కాకుండా నిర్మాత దిల్ రాజు తాను చెప్పిన విషయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ విషయానికి సంబంధించిన బంద్‌పై ఫిలిం ఛాంబర్ అఫీషియల్ లెటర్‌ను రాయనున్నట్లు తెలిపారు. అందరూ కూడా చాంబర్ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఫిలిం చాంబర్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ఫిలిం ఛాంబర్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. దీనికి ఫెడరేషన్ సపోర్టు కావాలని కోరారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఫిలిం ఛాంబర్‌ను అఫీషియల్ గా లెటర్‌ను పంపమని అడిగామన్నారు. అంతేకాకుండా ఛాంబర్ నిర్ణయానికి ఫెడరేషన్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు.