రాఖీని మహిళలే ఎందుకు కడతారు- కుడిచేతికే ఎందుకు కట్టాలో తెలుసా
శ్రావణపౌర్ణమి రోజున జంధ్యాల పండుగ కూడా ఉన్నా రక్షాబంధనానికే తొలి ప్రాధాన్యత. ఆగస్టు 11 మరియు 12న మనందరం రాఖీ పండుగ జరుపుకోబోతున్నాము. దీని విశిష్ఠతను గురించి తెలుసుకుందాం. ఇది ఆడవారే ఎందుకు కడతారో, కుడిచేతికే ఎందుకు కట్టాలో తెలిస్తే ఆశ్టర్యపోతారు. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నాస్తికులైనా, ఆస్థికులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా సరే ప్రతీ భారతీయుడు సంతోషంగా జరుపుకునే పండుగ ఈ రాఖీ పండుగ. అక్కాచెల్లెళ్లు ఉన్న ప్రతీవాడూ సోదరిముందు కూర్చుని రాఖీ కట్టించుకుంటాడు. సోదరి కూడా తన సోదరుని క్షేమం కోరుతూ అతనికి సకల విజయాలు కలగాలని ఆశిస్తూ, హారతి ఇచ్చి, బొట్టుపెట్టి, తీపిని తినిపిస్తూ రాఖీ కడతారు. పాశ్చాత్యుల ప్రభావంతో ఇప్పుడు మదర్స్‌డే, ఫాదర్స్‌డే, ఉమన్స్‌డే అంటూ రోజుకో DAY వచ్చి పడుతోంది.
కానీ రాఖీ అలా కాదు. మన పురాణకాలం నుండీ రక్షాబంధన్ ప్రస్తావన ఉంది. ఈ రాఖీని ఆడవాళ్లే ఎందుకు కట్టాలి, అదీ కుడిచేతికే ఎందుకు కట్టాలన్న ప్రశ్న రావచ్చు. దీనికి మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆయన చేతికి గాయమవుతుంది. అదిచూసిన ద్రౌపది వెంటనే తన చీర చెంగును చించి ఆయన వేలుకు రక్షగా కడుతుంది. దానికి ఆయన ప్రసన్నుడై నన్ను అన్నగా భావించి గాయానికి కట్టుకట్టావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆదుకుంటానని మాటిచ్చాడు కృష్ణుడు. ఇదే రక్షాబంధనానికి నాందిగా చెప్పుకుంటారు. తర్వాత కాలంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ఆమెను కౌరవులు అవమానించబోతే చీరలిచ్చి కాపాడాడు శ్రీకృష్ణుడు.
పేద, గొప్ప, తేడా లేకుండా జరుపుకునే పండుగ ఇది. ప్రముఖుల నుండి సామాన్యుల వరకూ సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఒక్కప్పుడు ఉత్తర భారతానికే పరిమితమైన రాఖీ పౌర్ణమిని క్రమంగా దేశమంతటా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్‌లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం. అందుకే దీనిని ఆడువారు మాత్రమే కడతారు. పూజలు, వ్రతాలకు ఆడువారికి ఉన్నంత ప్రాధాన్యత మగవారికి లేదు. మనస్ఫూర్తిగా దైవాన్ని స్మరించి తమ సోదరులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కడతారు. అదికూడా కుడిచేతికే కడతారు. ఎందుకంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏ శుభకార్యానికైనా కుడిచేతినే వాడతారు. కుడిచేతిని అదృష్టంగా భావించి, దైవ కార్యాలకు కుడిచేతినే వాడతారు. ఎడమ చేతిని అశుభంగా భావిస్తారు. అందువల్ల కుడిచేతికే రాఖీని కడతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోదర సోదరీమణులందరూ ఈ పండుగ సంతోషంతో జరుపుకుంటారు.