ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి
స్వాతంత్ర దినోత్సవాల వేళ జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని పర్గల్ వద్ద గల ఆర్మీ కాంప్ పై ఆత్మాహుతి దాడికి పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంప్ వద్దకు దూసుకొచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. రాజౌరికి 25 కి.మి దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుంది. జమ్మూ జోన్ అడిషనల్ డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/08/image-244.png)
తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంప్ లోపలికి దూసుకువచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. క్యాంప్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు పాల్పడగా… వీరిని గుర్తించిన ఆర్మీ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపింది. అయితే ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గత ఆరు నెలలుగా రాజౌరీ ప్రాంతంలోనూ వరుస ఉగ్రదాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/08/image-245-1024x576.png)
పంద్రాగస్టు వేళ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా భారీ దాడులకు ప్రయత్నించే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిన్న పుల్వామాలో ఓ రోడ్డు పక్కన 25 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది గుర్తించి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. బడ్‌గామ్ జిల్లాలోనూ భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు.