Home Page SliderTelangana

సీజనల్ వ్యాధులను కరోనాగా భ్రమపడవద్దు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో అధికసంఖ్యలో ప్రజలకు పడిశం, జలుబు, దగ్గు, జ్వరాలు మామూలే. వీటిని సీజనల్ వ్యాధులుగా పరిగణించాలని, కరోనాగా భ్రమపడి, బెంబేలు పడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా జలుబు, పడిశం వంటివి తొందరగా పట్టుకుంటాయి. దీనితో ఆందోళన పడకుండా అది సాధారణ జలుబు, జ్వరాలేనా అన్నది తెలుసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. జ్వరం మూడురోజుల కంటే ఎక్కువగా ఉంటేనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జలుబు, దగ్గులు తగ్గడానికి వారం రోజుల సమయం పడుతుందని, అతిగా దగ్గు, జలుబు మందులు వాడవద్దని సూచిస్తున్నారు. పిల్లలకు యాంటిబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదని సూచిస్తున్నారు. రాత్రి పూట దగ్గు ఎక్కువగా రావడం కూడా సహజమేనని, వారికి ఎక్కువగా వేడి నీటిని త్రాగిస్తే ఉపశమనం ఉంటుందని పేర్కొన్నారు. దగ్గుకు నీటిని మించిన ఔషధం  లేదన్నారు. తీవ్రజ్వరం, ఆయాసం, ఊపిరితీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రమే హాస్పటల్‌కు తీసుకెళ్లి, వైద్యుని సూచనల మేరకు పరీక్షలు చేయించాలని వైద్యుల సూచన.