తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి సంబరాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నా,పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరుస్తూ వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. వారం రోజుల ముందు నుండే దీపావళి వేడుక సందడి ప్రారంభమవగా, సోమవారం నాటితో ఈ ఉత్సవాల శోభ పతాక స్థాయికి చేరింది. ప్రతీచోట వ్యాపార, వాణిజ్య సముదాయాలు, వివిధ దుకాణాలు మొదలుకుని అన్ని ప్రధాన కూడళ్లు విద్యుద్దీపాల వెలుగులు, పచ్చని తోరణాలు, అందంగా అలంకరించబడిన పూలతో ముస్తాబై కనిపించాయి. ప్రతి దుకాణం ముందు అరటి కాండాలను ఏర్పాటు చేసి ముహూర్త సమయాలకు అనుగుణంగా వేద పండితులతో వ్యాపార వర్గాల వారు లక్ష్మీ పూజలు జరిపించారు. ప్రతి ఇంటి ఆవరణ కూడా దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగులు వెదజల్లింది. వేకువజామునే మంగళహారతులతో మొదలుపెట్టి సాయంత్రం నుండి రాత్రి వరకు లక్ష్మీ పూజలు చేసుకోవడంతో రోజంతా పండుగ కోలాహలం కనిపించింది. ఇక పూలు, మిఠాయిలకైతే ఎనలేని గిరాకీ ఏర్పడింది.

గృహిణులు తమతమ ఇళ్ల ముందు ప్రమిదలతో దీపాలు వెలిగించగా, వ్యాపారులు మినియేచర్ (రంగురంగుల విద్యుద్దీపాల)తో పాటు పూలతో వ్యాపార సముదాయాలను చూడచక్కని రీతిలో పోటాపోటీగా అలంకరించారు. పచ్చని తోరణాలతో విద్యుత్ దీపాలతో అమావాస్య అయినప్పటికిని ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. ఇళ్లలోనూ, వ్యాపార సంస్థల్లోనూ పండ్లు పూలతో అందంగా అలంకరించిన లక్ష్మీదేవి చిత్రపటాల ముందు కుటుంబ సభ్యులతో కూర్చుని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ లక్ష్మిపూజలు చేసిన అనంతరం తమతమ దుకాణాల ముందు బాణాసంచా కాలుస్తూ టపాసుల శబ్దాలతో మోత మోగించారు. తారాజువ్వలు గాలిలోకి పరుగులు తీస్తుంటే చిచ్చుబుడ్లు తామేమీ తక్కువ కాదంటూ కాంతులను విరజిమ్మాయి. వాటికి పోటీగా లక్ష్మిబాంబులు భారీ శబ్దం చేస్తూ సందడిని సృష్టించాయి. గత రెండేళ్ల కరోనా కాలంలో పండుగ చేసుకోలేక పోయిన ప్రజలు ఈ మారు రెట్టించిన ఉత్సాహంతో పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధరలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎవరి స్థాయిలో వారు దీపావళి బాణా సంచా కొనుగోలు చేశారు. గత వారం రోజుల ముందు భారీ వర్షాలు కురియడంతో అంతక ముందే దీపావళి సామాగ్రి కొనుగోలు చేసిన వ్యాపారులు ఒకింత ఆందోళనకు గురైనా ప్రజలు పెద్ద ఎత్తున బాణా సంచా కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

