కోలగట్లను కెలుకుతోంది బొత్సానేనా!
విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిపై… వైసీపీ స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. వైసీపీ పార్టీ విజయనగరం జిల్లా ఇంఛార్జి పీల్లా విజయ్ కుమార్ నేతృత్వంలో వీరభద్ర స్వామిపై నేతలు ఫిర్యాదు చేశారు. కోలగట్ల ఒంటెద్దు పోకడలు పోతున్నారనీ, పార్టీలో నియంతలా వ్యవహరిస్తున్నారనీ మంత్రి బొత్స సత్యనారాయణకు కంప్లైంట్ చేశారు. 75 ఏళ్ల స్వతంత్య్ర దేశంలో బీసీలకు ఇంకా స్వతంత్ర్యం రాలేదనీ, బీసీలకు కనీస ప్రాధాన్యత లేదనీ, వచ్చే ఎన్నికలలో బీసీలకు విజయనగరం టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంత్రి బొత్స అనుచరులను పట్టించుకోవడం లేదని నేతలు వాపోతున్నారు.
పార్టీ కార్యక్రమాలకు సమాచారం అందడం లేదని, మాకు పార్టీలో స్ఠానం లేదని బొత్స సత్యనారాయణను కలిసి తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేసారు. ఎమ్మెల్యే భూదందాలు, అవినీతికి అడ్డాగా మారుతున్నారని, పార్టీ పరువు తీస్తున్నారని, ఆయన అక్రమాలకు ఎదురు తిరుగుతున్నందువల్ల తమను పార్టీ వ్యవహారాలకు దూరం చేస్తున్నారని… జిల్లా వైసీపీ ఇన్‌చార్జి పిల్లా మండిపడ్డారు. ఎమ్మెల్యేకు అవినీతి తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని 80 శాతం మంది బీసీ ఓటర్లు ఉన్న ఈ నియోజక వర్గంలో 20 శాతం మాత్రమే ఉన్న ఓసీలకు టికెట్ కేటాయించడం సరి కాదన్నారు. వైసీపీ సామాజిక బస్సు యాత్ర జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని పార్టీకి తెలియజేసామన్నారు. బొత్సకి తమ సమస్యలు చెప్పుకున్నామని… ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసామన్నారు పిల్లా విజయకుమార్.