ఉపరాష్ట్రపతిగా ధన్ ఖడ్ ప్రమాణస్వీకారం
భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్ఖడ్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు , విపక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు.
ఈనెల 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ధన్ ఖడ్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విపక్షాలు మద్దతు పలికిన మార్గరెట్ అల్వా ఓటమి పాలయ్యారు. ధన్ ఖడ్ కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ. ధన్ ఖడ్ కు ఏన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంది.