Andhra PradeshNationalNews Alert

వైసీపీకి చెక్ పెట్టే పనిలో చంద్రబాబు

Share with

ఏదో ఒకటి చేయాలి.. చేసి విజయం సాధించాలి. మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. ఇందుకు అనుసరించాల్సిన అన్ని మార్గాలను ఇప్పుడు చంద్రబాబు అన్వేషిస్తున్నారు. టీడీపీకి పూర్వం వైభవం తీసుకు వచ్చి మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు. జాతీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎన్.డీ.ఏకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీతో సన్నిహిత సంబంధాల కోసం తపిస్తున్నారు. కాలం కలిసి రావాలంటే కలవాలి .. కలిసి నడవాలి. అధికారం దక్కాలంటే.. అందలం ఎక్కాలంటే ఎన్.డీ.ఏ పంచన చేరాలి. ఇదే ఇప్పుడు చంద్రబాబు వ్యూహంలా కనిపిస్తోంది. ఈ దిశగానే ఆయన తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. అయితే అనుకున్నది నెరవేరుతుందా ? ఎన్.డీ.ఏ అక్కున చేర్చుకుంటుందా ? తన తంత్రాలు ఫలించి మళ్ళీ ఏపీ ప్రజలు తనకు పట్టం కడతారా? ఇవే ఆలోచనలు చంద్రబాబును కలవర పరుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.


గత ఎన్నికలు టీడీపీకి ఇంకా మింగుడుపడ్డం లేదు. ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఘోర పరాభవం మిగిల్చిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. తెప్పరిల్లి లేచి నిలబడేందుకు ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 175 స్ధానాల్లో వైసీపీ 151 స్ధానాలను కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విజయంతో జాతీయ పార్టీల దృష్టిని వైసీపీ తనవైపు తిప్పుకుంటే.. టీడీపీ మాత్రం అవమాన భారంతో తీవ్రంగా కుంగి పోయింది. జాతీయ నేతలు కానీ, పార్టీలు కానీ చంద్రబాబును పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. ఆ పార్టీవైపు కూడా చూడడం కూడా లేదు. అయితే తిరిగి లేచి నిలబడాలంటే .. వ్యూహాలకు పదును పెట్టాలి. ఢిల్లీ వేదికగా పావులు కదపాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవకాశం కలిసి వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఇటీవల ఢిల్లీ వెళ్ళడం.. అక్కడ అనేక మంది జాతీయ నేతలను కలవడంతో కొంత ఊరట లభించినట్లయ్యింది. అలాగే సమావేశాల అనంతరం ప్రధాని మోదీయే స్వయంగా బాబు దగ్గరకు వచ్చి , ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకోవడం పట్ల టీడీపీ వర్గాల్లో ఒకింత ఆనందం వ్యక్తం అవుతోంది. పనిలో పనిగా ప్రత్యేకంగా మోదీని కలిసేందుకు బాబు కోరడం, ప్రధాని అందుకు అంగీకరించడం పట్ల బాబు వ్యూహం ఏంటో అర్ధం అవుతోంది. రానున్న ఎన్నికల్లో ఎన్.డీ.ఏ తో పొత్తుకు ఆయన ప్రయత్నస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు పదేళ్ళ గ్యాప్ తర్వాత మోదీ-బాబు కలయిక ఓ ప్రత్యేకతగా ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీని వైసీపీకి దూరంగా జరిపి, తాను లాభపడాలని బాబు వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయంగా వైఎస్ జగన్ ను ఒంటరిని చేయాలన్న వ్యూహంతో బాబు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని కోరక పోయినా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్.డీ.ఏ బలపరిచిన అభ్యర్ధులకు మద్దతు పలికారు.


టీడీపీ ఎత్తుగడులను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. మోదీకి దగ్గరయ్యేందుకు ఓవైపు బాబు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టాలని కూడా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడే లోపు అన్ని రకాలుగా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు తహతహ లాడుతున్నారు. ఒకవేళ బీజేపీతో బాబు కలిస్తే .. ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న అంశాలను వైసీపీ అంచనా కడుతోంది. కలిసొచ్చిన సందర్భాన్ని చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా బాబు అనేక మంది నేతలతో కూడా సమావేశం అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాబును బీజేపీ ఎంత వరకు విశ్వసిస్తుంది అన్నది ప్రశ్నార్ధకం. 2019 ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీపై అనేక విమర్శలు చేయడంతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో అంటకాగడం ఇప్పటికీ కమలనాధులు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ .. ఆ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణలో బీజేపీ గద్దెనెక్కేందుకు, ఎక్కించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రధాని మోదీ ముందు బాబు ఓ ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామృష్ణారెడ్డి కూడా ప్రస్తావించారు. రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలన్న దానిపై కాకుండా.. తన స్వప్రయోజనాల కోసం బాబు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే. ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎంత మేర లాభం చేకూరుతుంది అన్న లెక్కలు వేసుకుంటోంది బీజేపీ. వైసీపీని చేరదీయాలా.. లేక టీడీపీతో జట్టు కట్టాలా అన్న అంశంపై ఇప్పటికే కమలనాధులు ఓ క్లారిటీతో ఉన్నారని భావిస్తున్నారు. చూద్దాం.. ఎవరి వ్యూహాలు ఫలించబోతున్నాయి. ఎవరి ఎత్తులు గెలవబోతున్నాయి. ఎవరు ఎవరికి దగ్గర కాబోతున్నారు అన్నది.