కుల్వకుంట్ల కుటుంబం గద్దె దిగితేనే.. తెలంగాణ అభివృద్ధి
కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి పట్టిన శని
తొమ్మిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తండ్రి కొడుకులకు అబద్ధాలు ఆడటంలో నోబెల్ బహుమతి ఇవ్వాలి
సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తాలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’
రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు, కేసీఆర్ కుటుంబమే బంగారుమయం
తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని.. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తారా?
కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం అని కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు సార్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ.. తొమ్మిదేళ్లలో అమరవీరుల ఆక్షాంక్షలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం, సికింద్రాబాద్ లోని వారాసిగూడ చౌరస్తాలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా.. స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తర్వాతి ముఖ్యమంత్రి ఎవరో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఈ తొమ్మిదేళ్లలో.. బంగారు తెలంగాణ నిర్మాణం జరగలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి మోసం చేసి.. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు ఇచ్చారని, కేసీఆర్ కుటుంబం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటోందని కేంద్రమంత్రి విమర్శించారు.

కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో పేద ప్రజలకు ఇండ్లు వచ్చే అవకాశం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోపిడి చేసిన డబ్బుతో ఫామ్ హౌస్‌లు, విమానాలు కొంటోందని.. పార్టీలు పెట్టి దేశ వ్యాప్తంగా తమ పార్టీలో చేరమని డబ్బులు పంచుతోందని విమర్శించారు. ‘ఈ డబ్బు ప్రజల డబ్బు. వారితో ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులు లేవు కానీ, దేశమంతా ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బు దొరుకుతుంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చివరికి తెలంగాణ పేరుతో ఉన్న టీఆర్ఎస్ పార్టీని తీసేసి.. బీఆర్ఎస్ గా మార్చేశారన్నారు. 1200 మంది అమరవీరుల ప్రాణత్యాగం ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. కల్వకుంట్ల కుటుంబం పాలైందని కిషన్ రెడ్డి అన్నారు. తండ్రి కొడుకులకు అబద్ధాలు ఆడటంలో నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లో 80 రూపాయలు ఆదాయం వస్తే అందులో కనీసం 5 రూపాయల కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు.

నగరంలో అభివృద్ధి జరుగుతోందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సిటీలో పింఛను కార్డులు, రేషన్ కార్డులు లేవన్నారు. ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని ఆశ చూపించి, దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌లా ప్రధాని మోదీకి ఫామ్ హౌస్‌లు, వేల కోట్లు లేవన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ.. దేశ ప్రధాని అయ్యారని.. కరోనా టైంలో మోదీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇప్పుడు క్షేమంగా ఉన్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆత్మనిర్భర భారత్ నినాదంలో భాగంగా భారతదేశంలో రూపొందించిన వ్యాక్సిన్ వల్లే మన దేశ ప్రజలతోపాటు వివిధ దేశాల ప్రజలు ధైర్యంగా ఉన్నారన్నారు. కరోనా సమయం నుంచి 5 కేజీల ఉచిత బియ్యం దేశంలోని పేదలకు మోదీ సర్కార్ పంపిణీ చేస్తోందన్నారు. కేసీఆర్ వేలాది కోట్లు దోచుకుంటున్నారని, ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాలో బీఆర్ఎస్, లిక్కర్ మాఫియాలో బీఆర్ఎస్, ల్యాండ్ మాఫియాలో బీఆర్ఎస్ ఏదీ చూసిన అక్కడ గద్దల్లా వచ్చి ప్రజల నోటికాడి కూడును లాగేసుకుంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ తో పాటు నాగు రావు నమోజీ స్ధానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు

