NationalNewsNews Alert

వరండాలో ఓనర్లు… ఇంటి లోపల టెనెంట్… లేడీడాన్ ఏం చేసిందంటే?

Share with

కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు అయ్యింది పాపం ఆ దంపతుల పరిస్థితి. అద్దె డబ్బులు వస్తాయని ఇల్లు అద్దెకిస్తే వారికే గూడు లేకుండా పోయింది. తమ ఇల్లు అద్దెకిచ్చి, తాము మెట్లపై గడపాల్సివచ్చిందా యజమానులకు. ఇది వినడానికి హాస్యంగా అనిపించినా వాళ్లు పడిన తిప్పలు తెలిస్తే అయ్యో అనిపిస్తుంది.  విషయం ఏమిటంటే గ్రేటర్ నోయిడాకు చెందిన సునీల్‌కుమార్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పనిచేసి, రిటైర్ అయ్యారు. ఆయనకు నోయిడాలో సెక్టార్ 16బీ లో ఓ ఫ్లాట్ ఉంది. దానిని ప్రీతి అనే యువతికి అద్దెకు ఇచ్చారు. 11నెలలకు అగ్రిమెంట్ రాసుకున్నారు. అది ఈఏడాది జూన్‌తో ముగిసిపోయింది. సునీల్ ముంబయిలో ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యి సొంతింటికి రావాలనుకున్నారు. దీనితో ప్రీతికి ముందుగానే చెప్పారు. అగ్రిమెంట్ పూర్తి అయిన వెంటనే ఇల్లు ఖాళీ చేస్తే తాము ఇంటికి వస్తామన్నారు. ప్రీతి కూడా ఒప్పుకోవడంతో సునీల్ దంపతులు నోయిడాకు వచ్చేసారు. ఆమె ఇల్లు ఖాళీ చేసేవరకూ బంధువుల ఇంట్లో ఉన్నారు. ఇంతవరకూ బానే ఉంది.

కానీ అనుకున్నట్లు అన్నీ జరగవు కదా. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అగ్రిమెంట్ పూర్తయినా ఆమె ఇల్లు ఖాళీ చేయలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇది సివిల్ కేసు కనుక కోర్టుకు వెళ్లాలని సూచించారు. దీనితో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో తమ సొంతింటి మెట్లమీదే చతికిలబడ్డారు. కేవలం మనుషులే కాదండోయ్, మొత్తం ప్యాకేజీలతో దిగబడి మెట్లపైనే వంటా,వార్పూ మొదలుపెట్టారు. ఇరుగుపొరుగువారు ఇదంతా వీడియోకెక్కించి వైరల్ అవ్వడంతో వారంరోజుల తర్వాత ఎట్టకేలకు ప్రీతి ఆ ఇంటిని ఖాళీ చేసి వారికి అప్పగించింది. వారి న్యాయపోరాటానికి ఫలితం లభించింది. వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఇదండీ సంగతి. ఇళ్ల యజమానులు అద్దెకు ఇచ్చేటప్పుడు కాస్త ముందూ వెనకా ఎంక్వైరీ చేసుకోవాలన్నమాట.