లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. 8 గంటల విచారణ తర్వాత సిసోడియాను అరెస్టు చేసినట్టు సీబీఐ ప్రకటించింది. సిసోడియాను సీబీఐ రాత్రి 7.15 నిమిషాలకు అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఫిబ్రవరి 19న విచారణకు రావాల్సిందిగా సిబిఐ ఆయనను కోరింది. ఢిల్లీ ఆర్థిక మంత్రి కూడా అయిన సిసోడియా, ఢిల్లీ బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్నందున గట్టి షెడ్యూల్‌ని పేర్కొంటూ సిబిఐ ముందు హాజరు కావడానికి వారం రోజుల సమయం కోరారు. ఆయన అభ్యర్థనకు సీబీఐ అంగీకరించింది. సిసోడియా ప్రస్తావన లేని మద్యం పాలసీ కేసు ఛార్జిషీట్‌లో సిబిఐ ఏడుగురు నిందితులను పేర్కొంది.
కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోను.. దేశం కోసం ఉరిశిక్ష పడిన భగత్ సింగ్ అనుచరుడినంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. సీబీఐ కార్యాలయంలో మనీష్ సిసోడియా మాట్లాడుతూ, “7-8 నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందేమోనన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆప్ మద్దతుదారులు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేసుకుంటూ రోడ్‌షో ద్వారా వచ్చారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ స్మారకాన్ని సందర్శించి ప్రసంగించారు. మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయనున్నందున తమను గృహనిర్బంధంలో ఉంచినట్లు పలువురు ఆప్ నేతలు తెలిపారు.
“నేను 7-8 నెలలు జైలులో ఉంటాను. నన్ను చూసి జాలిపడకండి, గర్వపడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ అంటే భయం, అందుకే నన్ను ఫేక్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. మీరు పోరాడండి. మొదటి రోజు నుండి నాకు అండగా నిలిచిన నా భార్య అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి, నేను ఢిల్లీ పిల్లలకు చెప్పాలనుకుంటున్నాను, కష్టపడి చదువుకోండి, మీ తల్లిదండ్రుల మాట వినండి, ”అని మిస్టర్ సిసోడియా మద్దతుదారులతో అన్నారు.
దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మనీష్.. లక్షలాది మంది చిన్నారులు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఉన్నాయని.. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లినప్పుడు అది శాపం కాదు, ఘనత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. పిల్లలు, తల్లిదండ్రులు, ఢిల్లీలోని మేమంతా నీ కోసం ఎదురుచూస్తాం’’ అని అన్నారు.

