భారతీయులు… పాకిస్తానీలుగా ఎందుకు మారాలనుకుంటున్నారంటే..!
భారతదేశీయులు సాధారణంగా ఇతర దేశాల వారిని వివాహం చేసుకోవడం పరిపాటే. కానీ మిగతా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ పౌరులతో భారతీయుల వివాహం కొంచెం భిన్నమయిందనే చెప్పాలి. ఎందుకంటే వివాహం జరిగిన మహిళ అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ, కానీ పాకిస్తాన్‌లో ఉన్న కఠిన నిబంధనల కారణంగా భారత స్త్రీలకు తొందరగా పాకిస్తాన్ పౌరసత్వం దొరకడం లేదు. ఒక సర్వే ప్రకారం 2019లో భారత్ నుండి వెళ్లి పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నవారు ఎవరూలేరు. అయితే అది 2020 నాటికి 7కు పెరిగింది. అలాగే 2021 నాటికి 41కి చేరింది. నిజానికి భారత ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని (dual citizen ship) అంగీకరించదు. వారు మరొక దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తే, భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
దీనికి ఉదాహరణగా పద్మిని రాథోడ్ కథను చెప్పుకోవచ్చు. 2015లో రాజస్తాన్‌లోని కనోటా రాజ కుటుంబానికి చెందిన ఆమె వివాహం పాకిస్తాన్ సింధ్ ప్రాంతానికి చెందిన కున్వర్‌కర్ణ్ సింగ్‌తో జరిగింది. ఆమె సరిహద్దులు దాటిన ఈ వివాహాన్ని భారత యువతికి, పాకిస్తాన్ అబ్బాయితో రాయల్ వెడ్డింగ్ అంటూ ప్రముఖంగా అన్ని పత్రికలలో, మీడియాలో ప్రచారం జరిగింది. ఆమెకు పాకిస్తాన్ పౌరసత్వం ఇవ్వని కారణంగా ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లడానికి కూడా పాస్‌పోర్ట్, వీసా అవసరమయ్యేది. విదేశాలకు వెళ్లాలన్నా, భూములు కొనుగోలు చేయాలన్నా, చివరికి బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఇక్కడి ఆధార్ కార్డులాంటి పాకిస్తాన్ CNIC కార్డు అవసరం కానీ ఆమెకు భారత పౌరసత్వం (citizen ship ) ఉన్నందువల్ల ఆ కార్డు లభించలేదు. 2019 పుల్వామా ఘటన తర్వాత ఏడాదికి కేవలం 2సార్లు మాత్రమే భారత్‌కు అనుమతిస్తున్నారు. అంతకు పూర్వం 4 సార్లు అనుమతి ఉండేది. వారి కుటుంబంలో చాలామంది స్త్రీలు భారతీయులేనని, ఆమె అత్తగారు, అమ్మమ్మగార్ల కాలంలో పాకిస్తాన్ పౌరసత్వం వారాల్లోనే లభించేదని చెప్పింది. ఇప్పుడు పుల్వామా ఘటన, ఆర్టికల్ 370 రద్దు వంటి కారణాల వల్ల ఇండియా- పాకిస్తాన్ సంబంధాలు బాగా తగ్గించబడ్డాయని బాధపడ్డారు. ఇది చాలామంది అమ్మాయిల సమస్య. ఈ విషయంలో మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ మాట్లాడుతూ గల్ఫ్ ప్రాంతాలలో భారత- పాకిస్తానీ జంటల సంఖ్య పెరుగుతోందని, దరఖాస్తుల క్లియరెన్స్‌లు ఆలస్యం కావచ్చని, పాకిస్తానీ పౌరసత్వం కోరుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దీనికి ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.