NationalNews

ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రముఖ బాలీవుడ్‌ వెటరన్‌ నటి ఆశా పరేఖ్‌కు దక్కింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించిన ఈ అవార్డును ఈ నెల 30వ తేదీన ఆమెకు అందిస్తారు. 95 సినిమాల్లో నటించిన ఆశా పరేఖ్‌ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతోనూ సత్కరించింది. 79 ఏళ్ల ఆశా పరేఖ్‌ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు.

పదేళ్లకే సినీ రంగ ప్రవేశం..

1952లో పదేళ్ల వయస్సులో ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తుండగా ఆశా పరేఖ్‌ను చూసిన ప్రముఖ డైరెక్టర్‌ బిమల్‌రాయ్‌.. ఆమెను మా సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం చేశారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె నటించిన చిత్రాలు బాక్స్‌ ఆఫీసు వద్ద బోల్తా కొట్టడంతో నటనను ఆపేసి చదువును పూర్తి చేశారు. 16 ఏళ్ల వయస్సులో హీరోయిన్‌గా ఆమె మళ్లీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. డైరెక్టర్‌ నాసిర్‌ హుస్సేన్‌ రూపొందించిన దిల్‌ దేకే దేఖో (1959)లో షమ్మీకపూర్‌ సరసన కథానాయికగా నటించారు.

2019లో రజనీకాంత్‌కు అవార్డు..

వరుసగా జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై, ఫిర్‌ వహీ దిల్‌ లాయా హూ, తీస్రీ మంజిల్‌, బహారో కే సప్నే, ప్యార్‌ కా మౌసమ్‌, కార్వాన్‌, మంజిల్‌, కటీ పతంగ్‌, దో బదన్‌, చిరాగ్‌ తదితర సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఆశా పరేఖ్‌ మెప్పించారు. గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించిన ఆశా పరేఖ్‌.. 1970, 80వ దశకాల్లో బాలీవుడ్‌ను శాసించారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ఇంత వరకు రాజ్‌కపూర్‌, యశ్‌చోప్రా, లతా మంగేష్కర్‌, మృణాల్‌ సేన్‌, అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా అందుకున్నారు. దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఈ అవార్డు 2019లో దక్కింది. కొవిడ్‌ కారణంగా అప్పటి నుంచి ఈ అవార్డు ఎవరికీ ఇవ్వలేదు.