ఆ పార్టీని ఓడించేందుకే కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో!?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణాను ఆలంబనగా చేసుకోవాలని భావిస్తోంది. తెలంగాణలోని మెజార్టీ సీట్లను దక్కించుకుంటే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆ సీట్లు కీలకమవుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందు కోసమే ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో ముందుకు వచ్చింది. వాస్తవానికి కేంద్ర-రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చెబుతూ వచ్చేది. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడు స్లోగన్ కాంగ్రెస్ తీసుకుంటోంది. మెజార్టీ లోక్ సభ స్థానాల్లో అభ్యర్థుల్ని గెలిపిస్తే, కేంద్రంలోనూ కాంగ్రెస్ సర్కారు వచ్చే అవకాశముందని పార్టీ స్పష్టం చేస్తోంది. కేంద్రంలోనే అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేస్తామో ఆ పార్టీ చెబుతోంది.
ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు అంటూ కాంగ్రెస్ పార్టీ.. అభివృద్ధి నినాదాన్ని అందుకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో సంక్షేమంపై ఆధారపడ్డ పార్టీ, ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ మేనిఫెస్టో విడుదల చేసింది. యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో 23 అంశాలను జోడించినట్టుగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామన్నారు. యువత కోసం యూనివర్శిటీలు ఏర్పాటు చేయడంతోపాటు, క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా, హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతోపాటుగా, ఏపీలో కలిపిన 5 గ్రామాలను రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడంతోపాటుగా, నవోదయ, కేంద్రీయ విద్యా సంస్థలను మరింతగా పెంచుతామ కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న తరుణంలో, తమకు ఓటేస్తే, ఏం చేస్తామన్నది చెప్పేందుకు ఈ మేనిఫెస్టో విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక మేనిఫెస్టో ద్వారా బీజేపీ ఓట్లను, కాంగ్రెస్ వైపు మళ్లించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కీలక స్థానాల్లో గెలిచే అవకాశముందంటూ సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, కాషాయ పార్టీని నిలువరించాలని హస్తం యోచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడటంతో ఆ ఓట్లను కూడా తామే పొందాలని కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించుకుంటోంది.

తెలంగాణ ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో అవసరాలను గుర్తించి తాము మేనిఫెస్టో రూపొందించినట్టు పార్టీ నాయకులు చెప్పారు. తెలంగాణ బంగారు భవిష్యత్ ఇచ్చేలా తాము మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. మేనిఫెస్టోను ప్రతి గడపకు తీసుకెళ్లి, ప్రజల్లో ఆలోచన కలిగిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ కార్యకర్తలంతా వచ్చే 8 రోజులు కష్టపడి పనిచేయాలన్నారు నేతలు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి రిగేలా మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీప్ దాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

