NewsTelangana

మునుగోడులో కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌.. వెంకట్‌రెడ్డిపై వేటు..?

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంది. సిట్టింగ్‌ స్థానంలో ఎన్నికలకు రెండు వారాల ముందే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్‌.. మునుగోడు సాక్షిగా అంతర్గత పోరుకు తెరలేపింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కోపంతో పార్టీని భ్రష్టు పట్టించేందుకు కంకణం కట్టుకున్నారనే అపవాదును భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మూటగట్టుకున్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ గెలిచే చాన్స్‌ లేదని.. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు, తన అభిమానులకు వెంకట్‌రెడ్డి చేసిన విన్నపాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి పంపించేందుకు రంగం సిద్ధమైంది.

వెంకట్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు..

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాదయాత్ర తెలంగాణాలో అడుగు పెట్టిన రోజే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్‌ నోటీసు పంపించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫోన్‌ చేసినందుకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించ కూడదో చెప్పాలని షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్‌రెడ్డి నవంబరు 7వ తేదీన స్వదేశానికి రానున్నారు. ఆయన షోకాజ్‌ నోటీసుకు జవాబు ఆస్ట్రేలియా నుంచే ఇస్తారా.. మరింత గడువు కోరతారా.. నోటీసును పట్టించుకోరా.. అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా.. వెంకట్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయడం మాత్రం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వెంకట్‌రెడ్డిపై మూకుమ్మడి దాడి..

మరోవైపు వెంకట్‌రెడ్డిపై మూకుమ్మడి దాడికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెరలేపారు. కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగిన నేతలు పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని.. పార్టీ శ్రేణులంతా మునుగోడు వచ్చి సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కూడా వెంకట్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. బీజేపీ అభ్యర్థి అయిన తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న దుర్మార్గుడిని పక్కన పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. వెంకట్‌ రెడ్డి కోవర్ట్‌ ఆపరేషన్‌ చేస్తున్నారని.. బంధుత్వాలకు అతీతంగా రాజకీయాలు నడపాల్సిన తమ్ముడి విజయమే కావాలనుకుంటే కాంగ్రెస్‌ ముసుగు తీసేయాలని.. బీజేపీ కండువా వేసుకొని ప్రచారం చేసుకోవాలని హితవు పలికారు. రేవంత్‌ వర్గంగా గుర్తింపు పొందిన సీతక్కతో రేవంతే ఈ మాటలు చెప్పిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల పరస్పర దాడులు..

మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నాంపల్లి మండలంలో ప్రచారం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో నాంపల్లి అంబేద్కర్‌ చౌరస్తా వద్ద అభ్యర్థి స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన వాహనంపైకి ఎక్కిన కాంగ్రెస్‌ కార్యకర్త చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన రాజగోపాల్‌ రెడ్డి వెనక్కి తగ్గడంతో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలం జైకేసారంలోనూ రాజగోపాల్‌ రెడ్డి కాన్వాయ్‌పైకి ఎక్కిన ఓ కాంగ్రెస్‌ కార్యకర్త మైక్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు.