కాంగ్రెస్‌లో గడబిడ.. ముందు నుయ్యి… వెనుక గొయ్యి…
అంతర్గత కుమ్ములాటలతో గందరగోళం
రాజస్థాన్ సీఎం పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
రాజీనామా చేయాల్సిందేనంటూ గెహ్లాట్‌కు ఆదేశాలు
ఎవరికి సీఎం పీఠమో చెప్పాలంటూ గెహ్లాట్ ఒత్తిడి
గెహ్లాట్ తెగేదాక లాగుతున్నాడంటున్న పార్టీ వర్గాలు
పైలట్‌కు పట్టాభిషేకం దిశగా హస్తం అడుగులు
2014లో నరంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు ఆ పార్టీ బక్కచచ్చిపోతోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం వీస్తుంటే.. హస్తం పార్టీ మాత్రం లోబోదిబోమంటోంది. 2014 ఘోరపరాజయం తర్వాత 2019లో హస్తం పార్టీ పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత ఆ పార్టీ చీఫ్ బాధ్యతలకు రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే.. తిరిగి తాత్కాలిక చీఫ్‌గా సోనియాగాంధీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు రాజీనామా తర్వాత జరగాల్సి ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకన్నట్టుగా హస్తం పార్టీ చీఫ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుగల కావడం సరికొత్త కాంట్రవర్శీకి కారణమవుతోంది. పార్టీ చీఫ్ కోసం మీరంటే మీరు పోటీ చేయండని పార్టీ ఆదేశించాల్సిన దుస్థితి నెలకొంది. ఏఐసీసీ చీఫ్ రేసులో చాలా మంది అగ్రనేతలన్నప్పటికీ పార్టీ చూపంతా చెప్పిన మాట వినే గెహ్లాట్ వైపు కన్పిస్తోంది. మరెవరైనా నాయకుడు ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు చేపడితే వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న టెన్షన్ అటు సోనియా, రాహుల్ గాంధీలోనూ ఉంది.

పార్టీ కంటే అధికారమే ముఖ్యం!
కానీ గెహ్లాట్ మాత్రం రాజస్థాన్ సీఎం పీఠాన్ని వదులుకొని రావడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ ఏంటో ఆయన కళ్లకు స్పష్టంగా కన్పిస్తోంది. ఎలా చేసినా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదన్న ఫీలింగ్ ఆయనకు కలుగుతున్నట్టుగా ఉంది. వచ్చే ఏడాది పాటు రాజస్థాన్‌లో అధికారాన్ని ఆశ్వాదించే అవకాశమున్నా.. పార్టీ మాత్రం ఎందుకు తనను ఏఐసీసీ చీఫ్ గా తీసుకెళ్లాలనుకుంటున్నదానిపై ఆయన తర్జనభర్జనపడుతున్నాడు. మొత్తం వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీ తనపై కక్షగట్టారన్న అభిప్రాయంలో గెహ్లాట్ ఉన్నాడు. రాజస్థాన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించానని అటు గెహ్లాట్, ఇటు పైలట్ ఇద్దరూ గట్టిగా చెప్పుకుంటారు. కానీ అధికారం మాత్రం గెహ్లాట్‌కు లభించగా.. పైలట్‌కు మాత్రమే అవమానం మిగిలింది. వయసులో అనుభవం ఉండగా సరిపోతుందా… కాంగ్రెస్ పార్టీ అందించిన పవర్ కావాలని కానీ.. కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి గెహ్లాట్ ముందుకు రాకపోవడమేంటన్న చర్చ ఇప్పుడు పార్టీలో సాగుతోంది. పూర్తి కాలం పదవిలో ఉండి తర్వాత ఏఐసీసీ చీఫ్ తీసుకుంటారా అంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవేం మాటలంటూ ఆయనపై సీనియర్లు రుసరుసలాడుతున్నారు.

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో గెహ్లాట్ చిచ్చు
మరోవైపు రాజస్థాన్ ఎమ్మెల్యేలు పైలట్‌కు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురేస్తుంటే.. అందుకు కర్త, కర్మ, క్రియ అశోక్ గెహ్లాటేనని పార్టీ భావిస్తోంది. అందుకే గెహ్లాట్ చెప్పినట్టు వింటే ఓకే లేదంటే అసలుకే ఎసరొస్తోందని హెచ్చరించాలని భావిస్తోంది. ఒకవేళ గెహ్లాట్ మద్దతుదారులు, పైలట్‌కు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురేస్తే అందుకు సైతం పార్టీ మానసికంగా సిద్ధమైనట్టు కన్పిస్తోంది. ఇక్కడ ఒక్కటే పార్టీకి కన్పిస్తోంది. పైలట్‌కు ఇప్పుడు గానీ సీఎం పదవి ఇవ్వకుంటే ఆయన పార్టీ మారడం ఖాయమనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి సచిన్ పైలట్ ఎంతోకంత అడ్వాంటేజ్ అవుతారని కూడా భావిస్తోంది. అందుకే గెహ్లాట్ వ్యూహాలను జాతీయస్థాయిలో వినియోగించుకొని.. స్థానికంగా పైలట్‌తో ఎన్నికలను ఫేస్ చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. యూత్ ఫాలోయింగ్ ఉన్న పైలట్ వల్ల… అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీకి కచ్చితంగా మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతులు భావిస్తున్నారు. అందుకే కొరకరానికొయ్యలా మారిన గెహ్లాట్‌ను కట్టడిచేయడంతోపాటు.. ఆయనకు మద్దతుగా ఉన్న పలువురు నేతలకు వార్నింగ్స్ ఇవ్వాలని కాంగ్రెస్ తలపోస్తోంది.

మాట వినకుంటే గెహ్లాట్ ఇంటికే!
గెహ్లాట్ ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడితే అంతిమంగా రెండు విధాలుగా నష్టపోతారని వర్షన్‌ను కాంగ్రెస్ నేతలు విన్పిస్తున్నారు. రాజస్థాన్ సీఎం పీఠంపై ఇక ఎంత మాత్రం గెహ్లాట్ కొనసాగరన్న క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్, ఏఐసీసీ పీఠం విషయంలో ఆయన కాదంటే అందుకు తగిన ఆల్నేటివ్స్ చూసుకుంటోంది. ఇప్పటికే అరడజను మంది నేతలు పార్టీ చీఫ్ కోసం బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. గెహ్లాట్ మాట వినుకుంటే.. రాజస్థాన్‌లో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు రాహుల్ సన్నిహితవర్గాలు అంటున్నాయ్. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత వైభవం ప్రాప్తించాలంటే ముందుగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినకుండా చూడాలని ఆయన భావిస్తున్నారు. పంజాబ్ ఎక్స్‌పిరియన్స్ తర్వాత ఇక ఎంత మాత్రం తగ్గొద్దంటున్నారు. నిర్ణయాలు ఆలస్యం చేయడం వల్ల అంతిమంగా పార్టీకి నష్టమని ఆయన భావిస్తున్నారు.

