Home Page SliderTelangana

హైడ్రా పేరుతో వసూళ్లు..రంగనాథ్ హెచ్చరిక

హైడ్రా ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, తమ భవంతులను రక్షిస్తామని చెప్తూ కొందరు మోసగాళ్లు బిల్డర్లను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఇలాంటి వసూళ్లు, బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైడ్రా విభాగాల పేర్లను వాడుకుంటూ, తమ లక్ష్యాలను నీరుగార్చే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని, అలాంటివారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. కొందరు సామాజిక కార్యకర్తలుగా చెప్పుకుంటూ బిల్డర్ల వద్ద డబ్బులు అడిగితే అలాంటి వారిపై ఏసీబీకి గానీ, పోలీస్ స్టేషన్లకు గానీ ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో ఇలాంటి వసూళ్లకు పాల్పడినందుకు విప్లవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.