కుప్పకూలిన రూపాయి: భారీ నష్టాల్లో స్టాక్స్
. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, చివరికి అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాల్లో ముగిశాయి. మరోవైపు రూపాయి విలువ కుప్పకూలింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. డాలర్ విలువ తొలిసారిగా రూ. 96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం రూపాయి విలువ 96.07 కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి పతనం వల్ల దిగుమతి చేసుకునే చమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటివి మరింత ఖరీదవుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెన్సెక్స్ (Sensex) 160.73 పాయింట్లు పతనమై 75,237.99 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 75,870 పాయింట్ల గరిష్టాన్ని తాకినప్పటికీ, ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. నిఫ్టీ (Nifty) 46.10 పాయింట్లు నష్టపోయి 23,643.50 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 2,560 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటివి స్వల్ప లాభాలను గడించాయి. విప్రో, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి.

