పథకాలు అమలు చేస్తున్నామని ఎన్నికల్లో ఓట్లడుగుతామన్న సీఎం రేవంత్ రెడ్డి
భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్లు పథకం లక్ష్యమన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లు లెక్క అన్నారు. అందుకే ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారన్నారు. పదేళ్లు చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పి తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు ఒక బలమైన బంధం ఉందన్నారు. అందుకే ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించామన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సీఎం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్న సీఎం, పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించేందుకు ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించామన్నారు.

నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా…ఏ ఊరిలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో ఆ ఊర్లోనే మీరు ఓట్లు అడగాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతామన్న సీఎం, పేదలకు ఇండ్లు ఇస్తామన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. ఢిల్లీలో రైతులను బలి తీసుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు.

