Andhra PradeshHome Page Slider

కేంద్రఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ-విభజన చట్టంలోని పెండింగ్ నిధుల విడుదలపై ప్రత్యేక విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో విభజన చట్టంతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రత్యేకంగా చర్చించారు. ఏపీ పెండింగ్ నిధులను కేంద్రం నుంచి రాబట్టడమే లక్ష్యంగా సీఎం జగన్ న్యూఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరుగతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి వెళ్లిన సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై వరుస భేటీల్లో పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి సీఎం జగన్ వివరించారు. రెవన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ప్రభుత్వం ఇటీవలే నిధులు విడుదల చేయడంపై సీఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో  రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్‌, రూ.6,756.92కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆరోగ్య రంగంలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు -నేడు కింద వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని సీఎం జగన్ కోరారు.